ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు.. టీడీపీ అభ్యర్థులపై దాడులు..
- IndiaGlitz, [Monday,May 13 2024]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. దీంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు రాళ్ల దాడిని టీడీపీ నేతలు ఖండించారు. ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతరం లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణం అని మండిపడ్డారు. దొండపాడు పోలింగ్ కేంద్రం సమస్యాత్మక కేంద్రంగా ముందే చెప్పామని.. అయినా కానీ పోలీసులు టీడీపీ అభ్యర్థులకు సహకరించడం లేదని ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదుచేస్తామని.. రీపోలింగ్ నిర్వహించాలని కోరతామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలోని కంభంపాడు వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ల సందర్శనకు వెళ్లిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బృందంపై వైసీపీ లీడర్లు దాడి చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని పోలీసులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయడం లేదని కేశినేని చిన్ని ఆరోపించారు. ఓడిపోతున్నామని తెలిసి ప్రజల్లో మద్దతు లేదని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తిరుపతిలోని కొన్ని పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లు వేయించారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని సీపీఐ నేతల నారాయణ ఈసీకి లేఖ రాశారు. అలాగే రాయసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తెనాలిలో ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ను ఓ ఓటర్ అడ్డుకోగా.. అతడిని ఆయనతో పాటు అనుచరులు తీవ్రంగా కొట్టారు. ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదుచేశారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు.