Vinaya Vidheya Rama Review
`రంగస్థలం` సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు రాంచరణ్. ఈ యువ కథానాయకుడుకి మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. ప్రారంభంలో కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చిన చెర్రీ ధృవ, రంగస్థలం వంటి చిత్రాలతో వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. `రంగస్థలం` వంటి వైవిధ్యమైన సినిమా తర్వాత మాస్ అండ్ యాక్షన్ సినిమా చేయాలనుకున్న ఈయన బోయపాటితో జత కట్టాడు. హీరోలను మాస్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసే నేటి తరం దర్శకుల్లో బోయపాటి ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాలో ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ను దట్టించాడు. అది మనకు టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే టైటిల్‌ను మాత్రం `వినయవిధేయరామ` అని పెట్టాడు. టైటిల్లోని మృదుత్వం సినిమా ఉండదనే విషయం ట్రైలర్, టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అసలు బోయపాటి చరణ్‌ను వినయ విధేయ రాముడిగా, విధ్వసంకర రాముడిగా ఎలా చూపించాడనేది తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
కథ:
బాలకార్మికులుగా పనిచేసే నలుగురు అనాథలు అనుకోకుండా ఓ నేరాన్ని చూస్తారు. ఆ నేరగాడు వాళ్లని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారు భయపడి చనిపోవాలనుకునే సమయంలో .. వారికి ఓ చిన్నపిల్లాడు దొరుకుతాడు. వారు ఆలోచనను మార్చుకుని, కష్టపడి బ్రతకాలనుకుంటారు. వారికి సుబ్రమణ్యం(చలపతిరావు) అనే డాక్టర్ అండ దొరకడంతో .. అందరూ చదువుకుంటారు. చివరగా దొరికిన పిల్లాడికి రామ్(రామ్‌చరణ్) అని పేరు పెడతాడు. అందరూ పెరిగి పెద్దవుతారు. పెద్దవాడు భువన్ కుమార్ ఐ.ఎ.ఎస్ చదివి ఎన్నికల కమీషనర్ అవుతాడు. మిగిలిన ముగ్గురు అన్నలు పోలీస్ ఆఫీసర్స్ అవుతారు. రామ్‌కు ఇంట్లో వాళ్లందరూ కలిసి సీత(కియరా అద్వాని)తో పెళ్లి చేయాలనుకుంటారు. అందరూ హ్యపీగా ఉంటారు. ఓ సందర్భంలో నిజాయతీపరుడైన భువన్ కుమార్ వైజాగ్ ఎన్నికల్లో పందెం పరుశురాం(ముఖేష్ రుషి)కి ఎదురు నిలబడతాడు. భువన్ కుమార్‌ను భయపెట్టాలనుకుంటున్న పరుశురాం బావమరిది బల్లెం బలరాం(హరీష్ ఉత్తమన్) అతని మనుషులను రామ్ చితగ్గొడతాడు. దాంతో పరుశురాం భువన్‌కుమార్, రామ్‌లపై పగ పెంచుకుని .. భువన్‌కుమార్ లేని సమయంలో తనకు అండగా ఉండే పోలీస్ ఆఫీసర్(ప్రియదర్శిని రామ్ ) సహకారంతో అందరిపై తప్పుడు కేసు బనాయించి చంపాలనుకుంటాడు. అదే సమయంలో బీహార్ నుండి వచ్చిన రాజుభాయ్(వివేక్ ఒబెరాయ్) గ్యాంగ్ వీళ్ల కుటుంబంపై దాడి చేస్తారు. ఆ దాడి నుండి రామ్ అందరినీ కాపాడుతాడు. బీహార్ ముఖ్యమంత్రి (మహేష్ మంజ్రేకర్) అక్కడకు వచ్చి రామ్‌కు అండగా నిలబడటంతో ఆ పోలీస్ ఆఫీసర్‌కు రామ్ బ్యాగ్రౌండ్ తెలిసి భయపడతాడు. ఇంతకు రామ్ ఎవరు? అతనికి, బీహార్ ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్ ఏంటి? రాజుభాయ్‌తో రామ్‌కు ఉన్న గొడవేంటి? ఆ గొడవల నుండి రామ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వెన్నెముకలా నిలిచాడు. సినిమా అంతటా తానై ముందుకు నడిపించాడు. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్‌లో తనదైన నటనను కనపపరిచాడు. యాక్షన్ సీన్స్‌లో బోయపాటి మాస్ హీరోలా కనపించాడు. ఇక సినిమాలో కీలక పాత్రధారి ప్రశాంత్‌కు చాలా మంచి రోల్. విలన్.. హీరో మధ్యపోరాటానికి కారణమయ్యే సీన్స్‌లో కీలకంగా నటించాడు. ఇక విలన్‌గా నటించిన వివేక్ ఒబెరాయ్ .. రాజుభాయ్ పాత్రలో పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. ప్రథమార్థంలో వచ్చే పబ్ సాంగ్.. ఫ్యామిలీ సాంగ్ బావున్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. రిషి పంజాబి, అర్థర్ ఎ.విల్సన్ కెమెరా పనితం బావుంది. బీహార్ బ్యాక్‌డ్రాప్ కోసం అజర్ బైజాన్‌లో చిత్రీకరించడం.. ఆ ఫైటింగ్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఫైట్ అన్నీ మాస్ అడియెన్స్‌ను , మెగా ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటాయి.
మైనస్ పాయింట్స్:
తెర నుండి ఆర్టిస్టులున్నారు. వీరిలో నటనకు ఆస్కారముండే పాత్రలు కొన్నే. రవివర్మ, ఆర్యన్ రాజేష్ పాత్రలకు ఆసలు ప్రాధాన్యతే కనపడదు. స్నేహకు క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు.. మధ్య ఒకట్రెండు తప్ప .. సన్నివేశాలు లేవు. మిగిలిన వదినలుగా నటించిన మధుమతి, హిమజ తదితరులు, పిల్లలు.. అందరూ కెమెరా నిండారు.. కానీ యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాలేవు. నేపథ్య సంగీతం అస్సలు బాలేదు. కథ విషయానికి వస్తే రొటీన్ కథ.. ఓ రాష్ట్రాన్ని విలన్ భయపెడుతుంటే.. హీరో అతన్ని ఎదిరించడం.. హీరో విలన్‌ను గాయపరిచి తన ప్లేస్‌కు వచ్చేయడం.. విలన్..హీరోను వెతుకుతూ మన ప్లేస్‌కు రావడం.. చివరకు ఫైట్.. ఇవన్నీ సింహాద్రి టైం నుండి చూస్తున్నదే. నలుగురి చదివించిన డాక్టర్ మరో పిల్లాడిని లాజిక్‌లకు సుదూరంగా ఉండే సన్నివేశాలు.. అనవసరమైన హింస. యాక్షన్ పార్ట్.. బీహార్ సన్నివేశం కోసం అజర్ బైజాన్‌లోసన్నివేశాలు ఎందుకు తీయాలో అర్థం కాలేదు. అనవరసరమైన ఖర్చు మాత్రమే కనపడింది.
సమీక్ష:
నలుగురు అనాథలు.. వారికి ఓ చిన్న పిల్లాడు దొరకడం.. వారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అన్నీ బావున్నాయి. కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ వెతనక్కర్లేదు అనడం సబబే కానీ వెళుతున్న కథకు సుదూరంగా ఉండే లాజిక్స్‌ను కూడా వెతకొద్దు అనడం ఎంత వరకు సబబో సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు బోయపాటి రొటీన్ కథతో హీరో కత్తి పట్టుకుని టప టపా తలలు నరికేస్తుంటారు. పోలీసులు, మిలటరీ వాళ్లే భయపడే ప్రాంతంలో హీరో సునాయసంగా దూరేసి మూడు వందల మందిని చంపేస్తాడు. రాంచరణ్ హీరోయిజంను తనదైన స్టైల్‌లో బోయపాటి ఎలివేట్ చేశాడు. నిర్మాత డి.వి.వి.దానయ్య పెట్టిన ఖర్చు తెరపై కనపడింది. బోయపాటి మాస్ టేకింగ్‌కు రిమైనింగ్ ఎలిమెంట్స్ తోడు కాలేదనే చెప్పాలి. తెరనిండా నటీనటులున్నారు కానీ.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు తక్కువే. అయితే ఏ పాత్రకు దాని పరిధి మేర న్యాయం చేశారు నటీనటులు. బి, సి సెంటర్స్, మాస్ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌తో బోయపాటి సినిమాను తెరకెక్కించాడు.
బోటమ్ లైన్: వినయవిధేయరామ.. బోయపాటి స్టైల్ ఆఫ్ మూవీ.. మెగాభిమానులకు, మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.
Read 'Vinaya Vidheya Rama' Movie Review in English
- Read in English