పెద్ద తెర కట్టి, డీజే బాక్స్‌లు పెట్టి.. ‘‘అఖండ’’ను వీక్షించిన గ్రామస్తులు
- IndiaGlitz, [Wednesday,January 26 2022]
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘‘అఖండ’’. బాలయ్య నటన, బోయపాటి టేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలగలిసి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా, లాక్‌డౌన్‌లతో కళతప్పిన తెలుగు బాక్సాఫీసుకు అఖండ పండగ తెచ్చాడు. పసిపాప, ప్రకృతి జోలికొస్తే పరమ శివుడు దిగివచ్చి బుద్ధి చెబుతాడు అనే ఇతివృత్తంతో బోయపాటి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. బాలయ్య కెరీర్‌లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా అఖండ నిలిచింది. అంతకుముందు వరకు ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పుడు ఈ సినిమా గురించి మిగిలిన ఇండస్ట్రీలు ఆలోచిస్తున్నాయి. ప్రధానంగా బాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలు.. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లు అఖండను రీమేక్ చేయాలని చేయాలని భావిస్తున్నారట.
మరోవైపు అఖండ గురించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, గత నెలలో ఈ సినిమాను చూడటానికి ట్రాక్టర్లు వేసుకుని వెళ్లిన ప్రజలు.. సంక్రాంతి సమయంలో గ్రామంలో తెరలపై వేసుకుని చూశారట. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారి పాలెంలో ‘అఖండ’ను స్పెషల్ షో వేశారు. గ్రామం మధ్యలోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెరను, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసి, సినిమాను ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పండగలకు, ఉత్సవాలు, ఇతర ప్రత్యేక సమయాల్లో గ్రామాల్లో ఇలాగే తెరలను కట్టి సినిమాలను ప్రదర్శించేవారు. ‘అఖండ’ ఆనాటి రోజులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.