Vijetha Review
ప్రతి మనిషికి కొన్ని కోరికలుంటాయి.. వాటిని తీర్చుకోలేక జీవితంలో అడ్జస్ట్ అయ్యేవాళ్లు చాలా మంది ఉంటారు. అలా అడ్జస్ట్ అయిన ఓ తండ్రి ... తండ్రి కోరిక తీర్చే ఓ కొడుకు కథే విజేత. చిరంజీవి విజేతకు ఇప్పటి కల్యాణ్‌దేవ్ విజేతకు పొంతనే లేదు. మెగా క్యాంప్ హీరోగా పరిచయమైన చిరు చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన 'విజేత' ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవడానికి సినిమా కథంటో చూద్దాం...
కథ:
నేషనల్ జియోగ్రఫీ చానెల్‌లో స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా అవకాశం వచ్చినా.. కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ స్టిల్ కంపెనీలో చిరుద్యోగిగా మారిపోతాడు శ్రీనివాసరావు. కుటుంబ అవసరాలు తీరుస్తూ ఇద్దరి పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. శ్రీనివాసరావు కొడుకు రామ్(కల్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ చదివినా.. ఏ పనీ చేయకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఎదురింట్లో అద్దెకు దిగిన ఛైత్రను ప్రేమలో దించే ప్రయత్నాలు చేస్తుంటాడు రామ్. ఓ రోజు శ్రీనివాసరావుకి గుండెపోటు వస్తుంది. ఆ సమయంలో శ్రీనివాసరావు కుటుంబం గురించి పడే బాధను చూసి, అతని స్నేహితుడు.. శ్రీనివాసరావు బాధను రామ్‌కి వివరిస్తాడు. అప్పుడు తండ్రి పడే కష్టం తెలుసుకున్న రామ్.. ఈవెంట్ మేనేజర్‌గా ఓ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. అలాగే తన తండ్రి కలను నేరవేరుస్తాడు. ఈ ప్రయత్నంలో రామ్ తండ్రి కోసం ఏం చేశాడు? అనేదే కథ. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం మురళీ శర్మ. విలక్షణమైన పాత్రలను చేస్తున్న మురళీశర్మకు ఇది మరో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ పోషించాల్సిన డెప్త్ ఉన్న క్యారెక్టర్‌ను మురళీ శర్మ అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్.. క్లైమాక్స్‌లో వచ్చే స్టేజ్ సీన్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి. నా కొడుకుని భుజాలపై మోస్తే.. వాడు నన్ను ఆకాశానికి మోశాడు.. నేను బాధతో కన్నీళ్లను చూశాను.. ఆనందంతో వచ్చే కన్నీళ్లను ఇప్పుడు చూస్తున్నాను అంటూ సందర్భానుసారం వచ్చే డైలాగ్స్‌లో మంచి డెప్త్ కనపడుతుంది. ఇక రాకేశ్ శశి ఏదో కొత్త కథను కాకుండా చెప్పే కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. సెంథిల్ కెమెరా వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో వచ్చే కథనం, సన్నివేశాలు వేరే సినిమాల్లో చూసినవే కావడం. అలాగే హీరో, అతని స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సరిగ్గా పండకపోవడం.. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లేకపోవడం
సమీక్ష:
హీరో కల్యాణ్‌దేవ్ తొలి చిత్రం కావడం.. దర్శకుడు రాకేశ్ శశి చెప్పింది కల్యాణ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అది స్పష్టంగా కనపడుతుంది. పాత్ర మేర డాన్సులు, నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మాళవికా నాయర్ రోల్‌లో పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ కనపడదు. మురళీశర్మ లాంటి నటుడు లేకపోతే సినిమా బలహీనపడిపోయేది. దర్శకుడు చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్ కంటెంట్ మిక్స్ చేసి చెప్పడానికి ప్రయత్నించాడు. ప్రగతి, కిరిటీ, మహేశ్ విట్టా, తనికెళ్ళ భరణి ఇలా ప్రాత్రధారులందరూ వారి పాత్రల పరుధుల మేర చక్కగా నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, నేపథ్య సంగీతం పరావాలేదు బావున్నాయి. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఆకట్టుకుంటుంది.
చివరగా.. కుటుంబ కోసం లక్ష్యాన్ని విడిచి పెట్టే తండ్రి.. తండ్రి కలను తెలుసుకుని నేరవేర్చే కొడుకు `విజేత`
Vijetha Movie Review in English
- Read in English