ముస్తాబవుతున్న విజయేంద్రప్రసాద్ శ్రీవల్లి
- IndiaGlitz, [Tuesday,May 16 2017]
బాహుబలి తొలి భాగం విడుదలైనప్పటి నుంచి రెండు ప్రశ్నలు నన్ను చాలా కాలం పాటు వెంటాడాయి. వాటిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు...ప్రతి ఒక్కరు నన్ను అడిగేవారు. ఓ సందర్భంలో విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు బోర్డింగ్ పాస్ మార్చిపోయా. దానికి తీసుకోవడానికి వెనక్కివెళితే నేను ఎవరో తెలుసుకున్న అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కట్టప్ప బాహుబలిని చంపాడానికి కారణమేమిటో చెబితేనే ఆ పాస్‌ను ఇస్తామని అన్నారు. అలా ఆ ప్రశ్న వల్ల చిన్న చిన్న ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నాను. చివరకు బాహుబలి ది కన్‌క్లూజన్‌తో దానికి సమాధానం దొరికింది.
అలాగే శ్రీవల్లి సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామని చాలా రోజులుగా చిత్రబృందం అడుగుతున్నారు. బాహుబలి ది కన్‌క్లూజన్ తర్వాత విడుదల చేస్తే సినిమాకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఇన్నాళ్లు వేచిచూశాం. జూన్ నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నాం అని అన్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. పేరున్న నటీనటులు వారి ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్త తరహా సినిమాలు చేసినా అవి ఆకట్టుకోవడం కష్టం. ప్రేక్షకులకు తొందరగా రుచించవు. ఎలాంటి ఇమేజ్‌లేని కొత్త నటీనటులయితే పాత్రల కంటే కథపైనే దృష్టిపెట్టి సినిమాను బలంగా తెరపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నూతన తారలతో ఈ సినిమా చేశాను. ప్రోటాన్స్, న్యూట్రన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి.
ఆ మార్పును సరిదిద్ది వారిని స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన కథకు నేనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమాను తెరకెక్కించాను. మూడు భాషల్లో ఈ సినిమాను విడుదలచేయనున్నాం. కన్నడ భాషలో సెన్సార్ పూర్తయింది. త్వరలో తెలుగులో సెన్సార్ కార్యక్రమాల్ని నిర్వహిస్తాం అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ ఓ సినిమాకు రైటర్ తల్లి అయితే దర్శకుడిగా తండ్రిని చెప్పవచ్చు. రచయిత ఆలోచనను దర్శకుడు తెరపై పరిపూర్ణంగా ఆవిష్కరించగలిగినప్పుడే సినిమా అద్భుతంగా ఉంటుంది. విజయేంద్రప్రసాద్ మనసులో ఉన్న భావాలను బాహుబలి రూపంలో ఆయన తనయుడు రాజమౌళి అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఆ సినిమా గురించి, తనయుడి సంబంధించిన ప్రస్తావన ఎప్పుడూ వచ్చిన విజయేంద్రప్రసాద్ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. బాహుబలితో విశ్వ విజయేంద్రప్రసాద్ అనే పేరును సార్ధకం చేసుకున్నారు. వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మా ధైర్యం, బలం, బలగం అన్ని ఆయనే. ఆయన కథ, దర్శకత్వంపై నమ్మకంతోనే ధైర్యంగా మూడు భాషల్లో ఈ సినిమాను నిర్మించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, రజత్ పాల్గొన్నారు.