Vijayawada: హాట్‌హాట్‌గా బెజవాడ రాజకీయాలు.. దుర్గమ్మ క్షేత్రంలో విజయం ఎవరిది..?

  • IndiaGlitz, [Thursday,March 28 2024]

రాజకీయ చైతన్యంగా పేరుగాంచిన బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దుర్గమ్మ కొలువైన ప్రాంతం కావడంతో విజయవాడ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా ఉంటాయి. తొలి నుంచి నగరం కమ్యూనిస్టులు, కాంగ్రె హవాలో ఉండేది. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో బెజవాడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కమ్మ సామాజికవర్గంతో కాపు సామాజికవర్గం కూడా ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతలు కూడా ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నేతలు విజయవాడ వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం విశేషం.

ఇక 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్ టీడీపీ తరపున గెలిచారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2014లో విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ తరపున జలీల్ ఖాన్, 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక విజయవాడ సెంట్రల్‌ నుంచి టీడీపీ తరపు బోండా ఉమ విజయం సాధించగా.. 2019లో కేవలం 25 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఎన్నికల్లో బెజవాడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరుపున బోండా ఉమ, వైసీపీ తరపున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్, వైసీపీ తరపున దేవినేని అవినాష్.. వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సుజనా చౌదరి, వైసీపీ తరపున షేక్ ఆసిఫ్ ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. మిగిలిన నేతలు కాపు, వైశ్య, ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారు.

ఇదిలా ఉంటే విజయవాడ ఎంపీ సీటు మరింత హాట్‌గా మారింది. ఎందుకంటే రెండు వేర్వేరు పార్టీల నుంచి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, టీడీపీ తరపున కేశినేని చిన్ని బరిలో దిగారు. ఇద్దరు కమ్మ సామాజికవర్గం నేతలు కావడంతో పాటు బ్రదర్స్ కావడం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి ఎంపీగా గెలవలేదు.

దీంతో ఈసారి ఎలాగైనా బెజవాడ గడ్డ మీద వైసీపీ జెండా ఎగరేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో తమ కంచుకోట సీటును నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. మరి వీరిలో ఎవరి మీద దుర్గమ్మ ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.