Pawan Kalyan:వాలంటీర్ ఫిర్యాదు .. పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు , జనసేనానికి చిక్కులు తప్పవా..?
Send us your feedback to audioarticles@vaarta.com
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. కొందరు వైసీపీ నేతలు వాలంటీర్ల సహకారంతో ఒంటరి మహిళల వివరాలు సేకరించి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా వాలంటీర్లు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తూ.. పవన్ దిష్టిబొమ్మలను దగ్థం చేస్తున్నారు. సేవే పరమావధిగా పనిచేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు చేరుస్తున్న తమను పవన్ అవమానించారంటూ వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్ :
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. సురేష్ అనే వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సురేష్ ఈ ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, తద్వారా సమాజంలో తమను తలెత్తుకోకుండా చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిని స్వీకరించిన పోలీసులు పవన్ కళ్యాణ్‌పై ఐపీసీ 153, 153ఏ, 505 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 153 ప్రకారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కేసు నమోదు చేశారు. 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలకు అవకాశం వుందని మరో కేసు పెట్టారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినా కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారన్న పవన్ :
అసలు పవన్ ఏమన్నారంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని.. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి వుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం గ్రామ వాలంటీర్లేనని ఆయన ఆరోపించారు. వీరు సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతోందన్నారు. ఒంటరి మహిళల సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే ఈ ఘోరం జరిగిందన్నారు. దారి దోపిడి చేసే దొంగలకు, చెత్త పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వేసి జనాన్ని దోపిడీ చేసే జగన్‌కు తేడా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్‌కు విలువలు లేవని, ఆయనో క్రిమినల్ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
పవన్‌కు ఏపీ మహిళా కమీషన్ నోటీసులు :
వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను మహిళా కమీషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా నోటీసులు ఇవ్వాలని, లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారని.. ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాధానం ఇవ్వాలని కమీషన్ కోరింది. అలాగే తప్పిపోయినట్లుగా చెబుతున్న మహిళల వివరాలు ఇవ్వాలని , ఈ విషయం చెప్పిన కేంద్ర ప్రభుత్వ అధికారి ఎవరో కూడా తమకు తెలియజేయాలని ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments