Kesineni Nani: వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?
- IndiaGlitz, [Wednesday,January 10 2024]
ఎన్నికల వేళ విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీకి దూరమైన ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌తో నాని భేటీ కానున్నట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలో దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి జగన్‌ను కలిసిన తర్వాత నాని పోటీతో పాటు పార్టీలో చేరికపై స్పష్టత రానుంది. అయితే కేశినేని భవన్ వర్గాల సమాచారం ప్రకారం నాని.. వైసీపీ కండువా కప్పుకోవడం కన్ఫార్మ్ అని చెబుతున్నారు.
అందుకు తగ్గట్లే పసుపుమయంగా ఉండే విజయవాడ ఎంపీ కార్యాలయం రూపురేఖలు మారిపోయాయి. చంద్రబాబు ఫొటోతో ఉన్న పసుపు జెండాలు, ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్‌ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను పెట్టారు. అయితే ఇందులో దివంగత ఎన్ఠీఆర్ ఫోటోతో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు ఉండటం విశేషం.
కాగా ఇటీవల తన అవసరం లేదని చంద్రబాబు భావించాక తాను టీడీపీలో కొనసాగలేనని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. అనంతరం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. దీంతో కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మరోవైపు ఆయన కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటున్నారు.
రెండోసారి ఎంపీగా అయిన దగ్గరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో నాని పాల్గొనేవారు. సందర్భం వచ్చినప్పుడుల్లా చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై ధిక్కార వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరిగేది. కానీ ఆయన ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు ఆయన సోదరుడు చిన్నికి ఎంపీ టికెట్ కావాలని చంద్రబాబు నిర్ణయించడంతో పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.