Vijayashanthi:కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు..

  • IndiaGlitz, [Friday,November 17 2023]

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. అనంతరం ఆమె టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. ఆమెకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంలో ఉన్న విజయశాంతి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వీడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె స్పందించలేదు. కానీ ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆమె బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు బీజేపీని వీడారు. వివేక్, రాజగోపాల్ రెడ్డిలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తొలుత బీజేపీలో చేశారు. అనంతరం 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో కేసీఆర్ విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్‌లో ఆ పార్టీని విలీనం చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.