ఈ తరం హీరోయిన్లపై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు!
- IndiaGlitz, [Wednesday,September 11 2019]
ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ .. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాములమ్మ కీలక పాత్ర పోషిస్తోందని.. సినిమాకు హైలైట్కే అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాములమ్మ ఏ పాత్రలో నటిస్తోంది..? ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది..? అనేదానిపై సినీ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. విజయశాంతి ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు మీడియా మిత్రులు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ మీడియా మిత్రుడి నుంచి ఎదురైన వింత ప్రశ్నకు చాలా లాజిక్‌గా నటి కమ్ పొలిటీషియన్ సమాధానం చెప్పుకొచ్చింది.
అసలేం జరిగింది!?
ఈ తరం హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం..? అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ‘ఈ రోజుల్లో హీరోయిన్లుల ఏడాదిలో కేవలం రెండు, మూడు సినిమాలకే పరిమతం అవుతున్నారు. మేం హీరోయిన్లుగా ఉన్న సమయంలో ఏడాదికి 15 నుంచి 18 సినిమాల్లో నటించేవాళ్లం. ఇప్పుడున్న హీరోయిన్లు పెద్దగా కష్టపడడం లేదు. కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేసి.. అలసిపోకుండా జాగ్రత్తపడుతున్నారు’ అని విజయశాంతి వ్యాఖ్యానించింది. అంటే.. పరోక్షంగా ఈ తరం హీరోయిన్లు వేస్ట్ అని ఆమె చెప్పదలుకున్నారా..? లేకుంటే ఈమె మాటల వెనుక ఆంతర్యమేంటో మరి. అంతేకాదు.. అలిసిపోకుండా జాగ్రత్త పడుతున్నారంటే అర్థమేంటో రాములమ్మకే తెలియాలి మరి.
రియాక్షన్ ఉంటుందా!?
వాస్తవానికి సినిమాల్లో అవకాశాలు వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి..? ఏడాదికి రెండు సినిమాలే చేస్తున్నారంతే అని రాములమ్మ చెప్పడమేంటి..? అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా..? అని కొందరు నటీమణులు మనసులో అనుకుంటున్నారట. మరి రాములమ్మ మాటలపై ఈ తరం హీరోయిన్లు రియాక్ట్ అవుతారో లేకుంటే లైట్‌గా తీసుకుంటారో తెలియాల్సి ఉంది.