శ్రీవారిని నమ్మే భక్తురాలిగా చెబుతున్నా ఆలోచించండి!
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మూడ్రోజులుగా ఈ వ్యవహారంపై టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై సీనియర్ నటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ ఫేస్బుక్ వేదికగా స్పందించారు.
శ్రీవారి భక్తురాలిగా చెబుతున్నా..
‘తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి.. టిటిడి బోర్డు ఆమోదించే నిర్ణయం ఒకటికి వందసార్లు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది.. లేనిపక్షంలో అనవసరంగా శ్రీవారికి సంబంధించిన దేవస్థానం వివాదాలకు కేంద్రబిందువు అయ్యే ప్రమాదం ఉంది. తాజాగా టీటీడీ భూముల విక్రయం విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా, విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి తీసుకున్న చొరవను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో టిటిడి బోర్డు తరఫున తీసుకునే కీలక నిర్ణయాలకు సంబంధించి ఆధ్యాత్మికవేత్తలు సూచనలు సలహాలు తీసుకుంటే... ఇలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నా అభిప్రాయం... ఊహ తెలిసిన నుండి భక్తిప్రపత్తులతో, ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దర్శనం చేసుకున్న భక్తురాలిగా చెబుతున్నా ఆలోచించండి’ అని ఫేస్బుక్ వేదికగా విజయశాంతి తన అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఈ విషయంలో రాములమ్మకు నెటిజన్లు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. తమ మద్దతును కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
నిలుపుదల..
ఇదిలా ఉంటే.. వివాదాస్పదంగా మారిన భూముల వ్యవహారంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం నాడు సర్కార్ ప్రకటించింది. 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములను అమ్మాలని నాటి బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది. ఆథ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్వర్వుల్లో నిశితంగా పేర్కొంది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ భూముల వేలం ప్రక్రియ ఆపాలని ఉత్వర్వులు జారీ చేయడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది...
Posted by Vijayashanthi on Monday, May 25, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments