Vijayashanthi:కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే విమర్శలకు విజయశాంతి కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు లేదా ఏడాదికి మించి ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తుంటి ఎముక సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ను సీఎం, మంత్రులు పరామర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు మరింత ఎక్కువయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు డీజీపీ రవిగుప్తాకు కూడా ఫిర్యాదుచేశారు.
తాజాగా విపక్ష నేతల వ్యాఖ్యలపై రాములమ్మ విజయశాంతి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని తెలిపారు. దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె మండిపడ్డారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్కు అవసరమేమో కానీ కాంగ్రెస్కు ప్రభుత్వానికి అవసరం లేదని ధ్వజమెత్తారు. త్వరలోనే ప్రభుత్వం కూలుతుందంటూ గులాబీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రకటనలను కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అన్న ధోరణి విడిచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పది కాలాలు మంచిగుండాలని అభిప్రాయపడే విధానం ఉన్నట్లయితే కేసీఆర్ స్పందించాలని రాములమ్మ పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తెలిపారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 60 కన్నా 4 సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీని అస్థిరపర్చేందుకే రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని హస్తం నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments