ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాములమ్మ పోరాటం
Send us your feedback to audioarticles@vaarta.com
2018 ముందస్తు ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లోకి వలసలు ఆగట్లేదు. కాంగ్రెస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంత ఆపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే కారెక్కగా తాజాగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు.. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన టీడీపీ ఎమ్మెల్యేలు సైతం.. సైకిల్‌ను వద్దనుకుని కారెక్కేస్తున్నారు.
దీంతో అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్ అధిష్టానాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ టాటా చెప్పే ఎమ్మెల్యేలను ఉద్దేశించి పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని లేనిచో.. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి వారి తీరును అక్కడి ఓటర్ల ముందు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధపడాలని రాములమ్మ పోరాటం ప్రారంభించారు.
రాములమ్మ మాటల్లోనే...
"ఈవీఎంలను అడ్డంపెట్టుకుని, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీఆరెస్.. ఇప్పుడు ప్రజాతీర్పును సైతం అవహేళన చేస్తూ, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలుపెట్టే పనిలో పడింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే రీతిలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆరెస్ చేసే అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. టీఆరెస్ తరపున గెలిచి, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ వెనువెంటనే వేటు వేశారు. మరి కాంగ్రెస్, టీడీపీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై ఎందుకు స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు.
ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి వివాదాలకు తావివ్వని రీతిలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఓట్లు వేసి, గెలిపించిన ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో తగిన న్యాయం జరగకపోతే, పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి, వారి తీరును అక్కడి ఓటర్ల ముందు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధపడాలి. అంతిమ న్యాయం జరిగే వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడిచిపెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటానికి సన్నద్ధం కావాలి" అని రాములక్క చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ను కేంద్రంలోని బీజేపీని ఉద్దేశించి సోషల్ మీడియాలో రాములమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే విజయశాంతి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments