Vijayamma:ఇడుపులపాయలో జగన్‌తో విజయమ్మ.. కుమారుడికే మద్దతా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ముందుగా ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కుమార్తె షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా ఉంటే.. కుమారుడు వైసీపీ అధినేతగా ఉన్నారు. దీంతో ఆమె రాజకీయంగా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్‌తో కలిసి ఇడుపులపాయకు రావడంతో కుమారుడు జగన్ వైపే ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లైంది.
కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆమెకే విజయమ్మగా అండగా నిలిచారు. అక్కడ షర్మిల చేసిన పోరాటాల్లో తాను కూడా పాల్గొన్నారు. షర్మిలను అరెస్టు చేసినప్పుడు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు కుమారుడు ఏపీలో , కుమార్తె తెలంగాణలో రాజకీయాలు చేస్తారని.. ఇది దైవ సంకల్పమని తెలిపారు. అందుకే కుమార్తెకు అండగా ఉండటానికే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంతేకాకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చాక విజయమ్మ ఎక్కడా ఆమె పక్కన కనిపించలేదు. కానీ ఇటీవల జరిగిన షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు జగన్ కుటుంబం రాకపోయినా ఆమె మాత్రం పాల్గొని సందడి చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తర్వాత వివిధ సందర్భాల్లో ఇడుపులపాయకు వెళ్లిన సమయంలోనూ విజయమ్మ ఆమె వెంట రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం కుమారుడు జగన్‌తో కలిసి ఇడుపులపాయకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. దీంతో రాజకీయంగా తన మద్దతు కుమారుడికే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ విజయమ్మ జగన్ తరపున ప్రచారంలో పాల్గొంటే షర్మిలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుందని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments