Vijayamma: షర్మిలను కడప ఎంపీగా గెలిపించండి: విజయమ్మ

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

ఏపీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రచారం ముగుస్తున్న సమయంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ మేరకు విజయమ్మ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కి పంపించాలని కోరుతున్నాను పేర్కొన్నారు.

కాగా కుమార్తె షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా ఉంటే.. కుమారుడు జగన్ వైసీపీ అధినేత, సీఎంగా ఉన్నారు. దీంతో ఆమె రాజకీయంగా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోయారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆమెకే విజయమ్మగా అండగా నిలిచారు. అక్కడ షర్మిల చేసిన పోరాటాల్లో తాను కూడా పాల్గొన్నారు. షర్మిలను అరెస్టు చేసినప్పుడు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు కుమారుడు ఏపీలో , కుమార్తె తెలంగాణలో రాజకీయాలు చేస్తారని.. ఇది దైవ సంకల్పమని తెలిపారు. అందుకే కుమార్తెకు అండగా ఉండటానికే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంతేకాకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చాక విజయమ్మ సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ అమెరికాకు వెళ్లిపోయారు. తాజాగా ఇప్పుడు షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని కోరుతూ వీడియో సందేశం ఇచ్చారు. దీంతో కీలకమైన పోలింగ్ వేళ తన మద్దతు కుమార్తె షర్మిలకే అని స్పష్టంచేశారు. ఈ హఠాత్‌ పరిణామం వైసీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.