ఢిల్లీలో విజయసాయి వర్సెస్ పవన్.. చక్రం తిప్పేదెవరో!?
- IndiaGlitz, [Tuesday,January 28 2020]
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ ఈ రద్దును ఆమోదించగా ఇక మిగిలింది లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదాలే. అయితే.. కేంద్రం ఒప్పుకుటుందో లేదో అన్నది మాత్రం ఇప్పటికే అనుమానాలే. మరీ ముఖ్యంగా ఈ రద్దును ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి తీరాలని జగన్ నుంచి ఢిల్లీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలు రావడంతో ఆయన వడివడిగా కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగిపోతాయ్.. కేంద్రం ఈ రద్దును అంగీకరించేస్తుందనుకున్న టైమ్‌లో ఓ చిక్కు వచ్చిపడింది.
పవన్ మోకాలడ్డు!?
బీజేపీ-జనసేన కలిసి నడవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలోనూ ఇదే దోస్తీ ఉండనుంది. అయితే ప్రస్తుతం ఈ రద్దు వ్యవహారం ఏపీకి సంబంధించింది గనుక.. పవన్‌ను ఒక్క మాటైనా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక, సంచలన నిర్ణయాలను ప్రతి ఒక్కటీ పవన్ వ్యతిరేకించారు.. తాజాగా శాసన మండలి రద్దును కూడా ఒప్పుకోలేదు. అయితే ఈ తరుణంలో కేంద్రం.. పవన్‌కే ఈ నిర్ణయం వదిలేస్తుందని సమాచారం. ఒక వేళ ఇదే జరిగితే మాత్రం పవన్ అస్సలు ఒప్పుకోడన్న విషయం తెలిసిందే. సో.. ఢిల్లీ వేదికగా రాజకీయాలు హాట్ హాట్‌గానే సాగుతాయన్న మాట.
పవన్ దాకా వస్తే..!
అంటే.. వైసీపీ తరఫున ఢిల్లీ వ్యవహారాలు చూసుకునే విజయసాయి.. ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ గట్టిగా తలపడతారన్న మాట. మరి చక్రం తిప్పి ఎవరు నెగ్గుతారో.. ఏంటో మరి. వైసీపీ-బీజేపీకి మంచి సంబంధాలున్నాయ్.. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాస్త సీట్లు తేడా కొట్టుంటే.. వైసీపీ సాయం కచ్చితంగా కమలానికి అవసరం అయ్యేదే. సో.. దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా విజయసాయి మాట ఢిల్లీలో నెగ్గుతుందని తెలుస్తోంది. అసలు ఇది పవన్ దాకా వస్తుందా లేదా..? ఒక వేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి.