ఆడపిల్లలతో టీడీపీ ఆడుకుంటోంది: విజయసాయి

  • IndiaGlitz, [Tuesday,April 30 2019]

వ్యక్తి సమాచారాన్ని దొంగలించి ఆడపిల్లలు, మహిళలతో తెలుగుదేశం పార్టీ ఆడుకుంటుందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దొంగలించిన డేటాను టెర్రరిస్టులకు అమ్మే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు, లోకేష్‌ల బినామీ అశోక్‌ దాకవరానికి ఏపీ సర్కార్‌ భద్రత కల్పిస్తూ దాచేసిందన్నారు. చంద్రబాబు దుర్మార్గాలపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

గుండాల దగ్గర ఆడపిల్లల డేటా..

ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ప్రైవేట్‌ డేటాను చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ దొంగలించడం ప్రధాన సమస్య. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోని స్త్రీలకు సంబంధించిన వివరాలు తెలుగుదేశం గుండాల వద్ద ఉన్నాయి. ఆడపిల్లల ఫోన్‌ నంబర్లు, ఆధార్‌కార్డు నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు చంద్రబాబు పార్టీ దొంగల ముఠా వద్ద ఉన్నాయని మనం గమనించాలి. డేటా మొత్తం కూడా ఆధార్‌కార్డుకు సంబంధించి ఆధార్‌ డేటాలో ఈ ప్రగతి అని ఏపీ ప్రభుత్వం డెవలప్‌చేసిన ఈ ప్రగతి ఆధార్‌కార్డుకు అనుసంధానం చేశారు.

జే. సత్యనారాయణ అనే వ్యక్తిని 7 సెప్టెంబర్‌ 2016లో ఆధార్‌కార్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఎన్నికల వరకు ఆధార్‌ డేటా ఈ ప్రగతికి లింక్‌ చేసి సంక్షేమ పథకాలతో డేటా లీక్‌ చేశారు. యూఏడీ దగ్గర ఉన్న డేటాను ఈ ప్రగతికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఆ డేటాను సాఫ్ట్‌వేర్‌ ద్వారా కన్వర్ట్‌ చేసుకొని ఈ ప్రగతి నుంచి సేవా మిత్రకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. సేవా మిత్ర అనేది టీడీపీకి సంబంధించిన యాప్‌. డేటాను దొంగలించి తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది అని విజయసాయి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అశోక్‌ను పట్టుకుంటే..!

డేటా ఆరు కోట్లకు సంబంధించిన వివరాలు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను చంద్రబాబు తన యాప్‌లో పెట్టుకున్నాడు. డేటా ఇప్పటికీ ఎవరి చేతుల్లో ఉంది అనే దానిపై విచారణ జరగాలి. సేవా మిత్ర యాప్‌ ఐటీ గ్రిడ్స్‌ ఓనర్‌ అశోక్‌ దాకవరం చేతుల్లో ఉంది. ఈ రోజుకూ తెలంగాణ ప్రభుత్వం అశోక్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఐటీ గ్రిడ్స్‌ ఏయే వివరాలు సేకరించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా వ్యక్తులు ఎక్కడున్నారు.. ఎక్కడకు వెళ్తున్నారు.. ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ లిస్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఫోన్‌ స్టోరేజీలోకి వచ్చిన డేటాను డిలీట్‌ చేసే అవకాశం సేవా మిత్రకు ఉంది. ప్రతి సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ అనే నంబర్‌ ఉంటుంది.

నంబర్‌ ద్వారా ఫోన్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నారు. ఇలాంటిది దేశానికే ముప్పు. దీంట్లో అత్యంత ప్రమాదకరమైంది మైక్రోఫోన్‌ ఆడియో రికార్డింగ్‌. ఎవరి ఫోన్‌ అయినా ఆన్‌చేసి వెరెవరితోనైనా మాట్లాడుతుంటే అది కూడా రికార్డు చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తన బినామీ అశోక్‌ దాకవరంతో దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకొచ్చాడో అర్థం చేసుకోవచ్చు అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.