బాబూ.. రాజీనామా చేసి కుప్పంలో గెలవండి చూద్దాం!!
- IndiaGlitz, [Wednesday,October 23 2019]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అనుకున్నారో.. విమర్శించాలి కదా అని ఇలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. ‘ప్రజలు మళ్లీ నేనే రావాలని కోరుకుంటున్నారు’ అని కామెంట్ చేసిన విషయం విదితమే. అంతటితో ఆగని బాబు.. జగన్ పరిపాలనపై కాస్త డోస్ పెంచి మరీ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బాబూ.. రాజీనామా చేసి గెలవండి!
‘ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారట. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారు. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మంది. ముందు మీరు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తాన్నారని భావిస్తారంతా’ అని బాబుకు విజయసాయి ఒకింత సవాల్ విసిరారు.
4 నెలల్లోనే 80 శాతం హామీలు!
‘వంశ పారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు @AndhraPradeshCM గారు భరోసా కల్పించారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటిని పునర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. 4 నెలల్లోనే సీఎం గారు 80 శాతం హామీలను నెరవేర్చారు’ అని జగన్‌ను విజయసాయి ఆకాశానికెత్తేశారు.
దరిద్రం.. టచ్ మహిమ!
‘ఒక వ్యక్తి తన ‘టచ్’ మహిమతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటిని కోలుకోలేకుండా చేశాడు. తన దరిద్రాన్ని అందరికీ అంటించి వచ్చాడు. వచ్చే జనవరిలో ఢిల్లీ, 2021 మేలో బెంగాల్ ఎలక్షన్లున్నాయి. వాటి ఫలితాలెలా ఉంటాయో మనం ఊహించవచ్చు. తనేమో బిజెపీ ‘క్షమాభిక్ష’ కోసం ఎదురు చూస్తున్నాడు’ అని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్!!
అయితే విజయసాయి ట్వీట్‌కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటరిస్తూ ట్వీట్ చేశారు. ‘దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ మీ తుగ్లక్ ముఖ్యమంత్రి అని కొత్తగా చెప్పక్కర్లేదు. మీరు అడుగుపెట్టాక రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసారెడ్డీ. గోదావరిలో బోటును ముంచి 56 మంది అమాయకులను మింగేశారు.. రాష్ట్రంలో 256 మంది రైతుల్ని మింగేశారు’ అని విజయసాయికి బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.