నడిచే వ్యక్తి కృష్ణ.. ఆయన్ను నడిపించింది విజయనిర్మలే!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
‘నడిచే వ్యక్తి కృష్ణ అయితే, ఆయన్ను నడిపించింది మాత్రం విజయనిర్మలే’ అని టాలీవుడ్ హీరో కమ్ పొలిటిషియన్ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. శనివారం నాడు దివంగత నటి విజయనిర్మల సంస్మరణ సభ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి ఆమెతో తమకున్న అనుబంధాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించేవారని, చమత్కారంగానూ విజయనిర్మల మాట్లాడగలరని బాలయ్య తెలిపారు.
ముగ్గురు కాదు నలుగురు కృష్ణులు!
నేను, కృష్ణ, కృష్ణంరాజు కలిసి 'సుల్తాన్' సినిమా చేశాము. అప్పట్లో షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లగా, విజయనిర్మల కూడా వచ్చి, మాకు స్వయంగా వంట చేసి పెట్టారు. అక్కడి తెలుగు అసోసియేషన్ మాకు సన్మానం చేశారు. ఆ కార్యక్రమంలో నేను మాట్లాడుతూ.. వేదికపై ముగ్గురు కృష్ణులు ఉన్నారని చెప్పగానే.. టక్కునే విజయనిర్మల లేచి నా చేతిలోని మైక్‌ను అందుకుని.. ముగ్గురు కాదు నలుగురు అని చెప్పి.. పాండురంగ మహాత్మ్యం సినిమాలో తాను కృష్ణుడిగా నటించానని గుర్తు చేశారు. ఇక్కడ నలుగురు కృష్ణులు ఉన్నారని చమత్కరించారు. నేను ఆమెను ఎప్పుడు కలిసినా.. పాజిటివ్ ఎనర్జీతో కనిపించేవారు అని చెబుతూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు.