బాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి..

  • IndiaGlitz, [Saturday,January 02 2021]

ఏ పాత్ర అయినా సరే.. అద్భుతంగా నటించి.. మెప్పించగల నటుడు.. విజయ్‌ సేతుపతి. అందుకే ఆయనకు అవకాశాలకేమీ కొదువ లేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా బాలీవుడ్‌లోనూ విజయ్ సేతుపతికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో వాటికి కూడా ఓకే చెబుతూ ఫుల్ బిజిబిజీగా గడిపేస్తున్నాడు. ఓ వైపు ఆమిర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' లో నటిస్తూనే మరోవైపు షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించడానికి రెడీ అయ్యారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కామన్‌గా జరిగేదే. అలాగే దక్షిణాదిలో విజయవంతమైన సినిమాలను బాలీవుడ్‌‌లో రీమేక్స్‌ చేస్తున్నారు. కాగా.. తాజాగా ‘మా నగరం’ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ఒక పాత్రను పోషించాడు. ప్రస్తుతం ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో సందీప్‌ కిషన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.