బాలీవుడ్ స్టార్‌తో విజ‌య్ సేతుప‌తి వెబ్‌సిరీస్‌..!

  • IndiaGlitz, [Tuesday,December 22 2020]

కోలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి గురించి మన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగులో ‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో న‌టించిన ఈ స్టార్‌.. వైష్ణవ్ తేజ్‌తో ‘ఉప్పెన’ చిత్రంలోనూ నటించాడు. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉండే ఈ స్టార్ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా విజయ్ సేతుపతి ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ప‌రిచ‌యం కానున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. దీంతో పాటు రీసెంట్‌గా ఓ భారీ వెబ్‌సిరీస్‌లో న‌టించ‌డానికి విజ‌య్‌సేతుప‌తి ఓకే చెప్పాడ‌ట‌.

ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌స్టార్ షాహిద్ క‌పూర్ కూడా న‌టిస్తున్నాడు. ‘ఫ్యామిలీ మేన్’ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించిన తెలుగు ద‌ర్శ‌కులు రాజ్‌, డీకే.. ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. గోవా, ముంబైల్లో దీన్ని తెరకెక్కిస్తారట. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. మరి ఇందులో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర చేస్తాడనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రాజ్, డీకే రూపొందించిన ఫ్యామిలీ మేన్ సీజన్ 2 త్వరలోనే ప్రసారం కానుంది. ఇందులో సమంత అక్కినేని టెర్రరిస్ట్ పాత్రలో నటించింది.