‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు. తన బయోపిక్ నుంచి వైదొలగాలంటూ విజయ్ సేతుపతికి మురళీధరన్ రిక్వెస్ట్ చేశారు. దీంతో విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు. తన కారణంగా ఓ మంచి తమిళ నటుడు బాధపడకూడదని భావిస్తున్నానని మురళీధరన్ పేర్కొన్నారు. కెరీర్ పరంగా విజయ్‌కు సమస్యలు రాకూడదని ఆయన ఆశించారు. అందుకే విజయ్‌ను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
తన బయోపిక్ 800పై వచ్చిన వివాదాల నేపథ్యంలో తాను ఈ ప్రకటన చేస్తున్నానని మురళీధరన్ తెలిపారు. లేనిపోని అపోహలతో విజయ్ సేతుపతిపై కొందరు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయ్ సేతుపతి స్థానంలో మరో నటుడిని నిర్మాతలు ఎంపిక చేస్తారని.. తన బయోపిక్ త్వరలోనే అభిమానులు, ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మురళీధరన్ ప్రకటనపై విజయ్ సేతుపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
కాగా.. శ్రీలంక తమిళియన్ అయిన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటించిన కొద్ది సేపటికే తమిళనాడులో వివాదం మొదలైపోయింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి మహింద్ర రాజ్‌పక్సేను గతంలో మురళీధరన్ సపోర్ట్ చేశారు. శ్రీలంకలో తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడం కోసం దాదాపు 30 ఏళ్ల పాటు కొన్ని లక్షల మంది తమిళులను ఊచకోత కోశారు. దీంతో మహింద్ర రాజ్‌పక్సేపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి మహింద్ర రాజ్‌పక్సేను సపోర్ట్ చేయడంతో మురళీధరన్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments