విజయసాయి, మిథున్, మార్గానికి కీలక బాధ్యతలు
- IndiaGlitz, [Wednesday,June 05 2019]
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మే-30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. మరోవైపు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం.. ఇంకోవైపు పలు శాఖల అధికారులతో సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం శాయశక్తులా కృషి చేసిన నేతలకు.. కొత్త నేతలకు కీలక బాధ్యతలను జగన్ అప్పగిస్తున్నారు.
తాజాగా.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని.. మరోవైపు లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని.. పార్టీ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియమించారు. కాగా.. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ ముగ్గురి నియామకాలను అధికారికంగా పరిగణనలోనికి తీసుకోవాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. కాగా వీరిలో విజయసాయిరెడ్డి సీనియర్ కాగా.. మిథున్ రెండోసారి ఎంపీగా గెలిచారు. అయితే మార్గాని భరత్ మాత్రం ఫస్ట్ టైమ్ గెలవగా ఆయనకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషమని చెప్పుకోవచ్చు.
జగన్‌కు ధన్యవాదాలు..
పార్లమెంటరీ పార్టీ నేతగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ లోక్‌సభ పక్ష నేతగా నియమితులైన మిధున్ రెడ్డి, చీఫ్ విప్‌గా నియమితులైన మార్గని భరత్ రామ్‌కు నా శుభాకాంక్షలు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ను.. లోక్‌సభ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్‌గా సుజనా చౌదరిని నియమించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది. కాగా.. అప్పలనాయుడు ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.