Vijay Deverakonda:వాళ్లను జడ్జ్ చేయడానికి మన రేంజ్ ఎంత : చిరు, రజనీలపై విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

  • IndiaGlitz, [Tuesday,August 22 2023]

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , నిర్మాతలు అందరూ నిండా మునిగిపోయారు. ఒకానొక దశలో నిర్మాత అనిల్ సుంకర తన ఇల్లు, తోటను అమ్ముకోవాల్సిన పరిస్ధితి వచ్చిందంటూ కథనాలు వచ్చాయి. అయితే వీటిని నిర్మాత కొట్టిపారేశారు. ఈ సినిమాతో చిరంజీవి పని అయిపోయిందని.. ఎవరో ఒక స్టార్ తోడు లేనిదే ఆయన హిట్ కొట్టలేరని, రీమేక్‌లను నమ్ముకుంటే ఇంతేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చిరంజీవి స్టార్‌డమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరు వచ్చాక ఇండస్ట్రీయే మారిపోయింది:

విజయ్, సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ చెన్నై వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఓ ప్రెస్‌మీట్‌లో విజయ్ మాట్లాడుతూ.. చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టం, గౌరవం అన్నారు, ఆయన ఒక లెజెండ్ అని.. సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని.. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి అని విజయ్ కొనియాడారు. చిరంజీవి ఒక ఎవరెస్ట్ అని.. ఆయన సాధించిన విజయాలు తన లాంటి వారికి స్పూర్తి అని.. అలాంటి వ్యక్తిని మనం జడ్జ్ చేయలేమన్నారు. చిరు వచ్చాక యాక్షన్, డ్యాన్స్ , పర్ఫార్మెన్స్ పూర్తిగా మారిపోయాయని.. ఎంతోమంది ఇండస్ట్రీ వైపు రావడానికి చిరు ప్రేరేపించారని విజయ్ అన్నారు.

నోరు మూసుకుని చూడటమే :

భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో చిరుపై వస్తున్న కామెంట్స్ చూస్తే తనకు బాధగా వుందని.. కనీసం గౌరవం లేకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. చిరు, రజనీ లాంటి వారికి వరుసగా ఫ్లాప్స్ వచ్చినా మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ విశ్వరూపం చూపిస్తారని విజయ్ పేర్కొన్నారు. రజినీకి వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని.. కానీ రీసెంట్‌గా ఆయన నటించిన జైలర్‌ ఇవాళ్టీకి రూ.500 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంటే అందరూ నోరు మూసుకుని చూశామన్నారు. అందుకని చిరు, రజనీ లాంటి వ్యక్తులు జయాపజయాల గురించి పట్టించుకోరని విజయ్ దేవరకొండ అన్నారు.

మెగాభిమానుల మనసు గెలుచుకున్న విజయ్ :

అన్ని వైపుల నుంచి చిరంజీవిపై విమర్శలు వస్తున్న వేళ.. విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం కోట్లాది మంది మెగాభిమానుల మనసు గెలుచుకుంది. అంతేకాదు సీనియర్ నటుల పట్ల విజయ్ దేవరకొండకు వున్న గౌరవాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.