వివాదాల‌తో ఫ్రీ పబ్లిసిటీ.....కేరాఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  • IndiaGlitz, [Monday,October 01 2018]

ప్ర‌తి హీరోకు ఇమేజ్ అవ‌స‌రం.. ఇమేజ్ లేని హీరోని ఎవ‌రూ పట్టించుకోరు. స్టార్ హీరోల అండ దండ‌ల‌తో వ‌చ్చిన హీరోలు సైతం ఈ ఇమేజ్ కోసం ప‌డే పాట్లు ఎన్నో ముఖ్యంగా యూత్‌లో క్రేజ్ ద‌క్కించుకోవ‌డం ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో అంత సులువు కాదు.. 'హ్యాపీడేస్‌'లో ఓ గుర్తింపు లేని ఓ చిన్న పాత్ర‌. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం'లో కీల‌కపాత్ర‌లో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ 'పెళ్ళిచూపులు' చిత్రంతో తిరుగుని స‌క్సెస్ అందుకున్నాడు. ఏదో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌దా!! స‌క్సెస్ స‌హ‌జ‌మే అనుకున్నారు. అయితే సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో యాట్యిట్యూడ్ ఉన్న కుర్రాడు పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన 'అర్జున్ రెడ్డి'తో స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్‌గా ఈ ఏడాది విడుద‌లైన 'గీత గోవిందం' సినిమాతో ఏకంగా వంద‌కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించిన స్టార్ హీరో లీగ్‌లో చేరిపోయాడు. చాలా యువ హీరోల‌కు ఎన్నో సంవ‌త్స‌రాలుగా సాధించాల‌నుకుంటున్న క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌... అయితే ఈ స‌క్సెస్‌ల వెనుక విజ‌య్ క‌ష్టం, యాట్యిట్యూడ్ మాత్ర‌మే ఉందా? అంటే వీటికి తోడు ఫ్రీ ప‌బ్లిసిటీ.. కోట్లు ఖ‌ర్చు పెట్టి ప‌బ్లిసిటీని తెచ్చుకోవాల‌ని ఎంద‌రో నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మాత్రం ఎలాంటి ఖ‌ర్చులేని ఫ్రీ ప‌బ్లిసిటీ దొరికేస్తుంది.. అది కాలం అలా కూడి వ‌స్తుందా? లేక ముందుగానే చేసుకున్న ప్లానింగో ఏమో ఆ దేవుడికే ఎరుక‌...

'పెళ్ళిచూపులు' త‌ర్వాత అర్జున్ రెడ్డి సినిమా అయ్యింది. పెళ్లిచూపులు హిట్ అయ్యింది. అప్ప‌టికే కొంత క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే 'అర్జున్ రెడ్డి' విడుద‌ల‌కు ముందుగానే వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. సినిమా రిలీజ్‌కు నాలుగు రోజులు ఉంద‌గా..కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ వి. హ‌నుమంత‌రావు ఈ సినిమా ముద్దు పోస్ట‌ర్‌ను చించేశాడు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ సినిమాపై.. అందులోని ముద్దు సీన్స్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చి పెట్టాయి. దీంతో యూత్ అంతా సినిమాలో ఏదో ఉంద‌ని అనుకున్నారు. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు త‌గిన‌ట్లుగానే.. యూత్‌ను ఆక‌ట్టుకునే లిప్ లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టన యూత్‌కు న‌చ్చేసింది. సినిమా ఎక్కేయ‌డంతో విజ‌య‌ఢంకా మోగించింది. ఆరు కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

గీత గోవిందం.. అర్జున్ రెడ్డితో స్టార్ క్రేజ్ ద‌క్కించుకున్న హీరో.. ప‌రుశురాం టేకింగ్‌.. ర‌ష్మిక న‌ట‌న‌తో అన్ని క‌ల‌గ‌లిపిన ఈ సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీ ప‌రంగా క‌లిసొచ్చిన అంశం పైర‌సీ.. సినిమా విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం పైర‌సీ అయ్యింది. సినిమా విడుద‌ల‌కు రెండు రోజుల ముందే ఈ విష‌యం జ‌ర‌గ‌డంతో యూనిట్ అవాక్కైంది. పోలీసులు రంగంలోకి దిగి.. పైర‌సీకి కార‌ణ‌మైన అంద‌రినీ అరెస్ట్ చేసేశారు. విడుద‌లైన కొద్ది పార్ట్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌ధ్య లిప్ లాక్‌లున్న సంగ‌తి తెలిసింది. ఇలాంటి ప‌రిస్థితులు కూడా గీత గోవిందం చిత్రానికి ప‌బ్లిసిటీ ప‌రంగా ఎంత‌గానో స‌పోర్ట్ చేశాయి.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా బై లింగ్వువ‌ల్‌(తెలుగు, త‌మిళ‌) చిత్రం 'నోటా'. ఈ సినిమా అక్టోబ‌ర్ 5న విడుద‌ల అనుకున్నారు. విడుద‌ల‌కు నాలుగు రోజ‌లు ముందు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అనే పెద్ద‌గా పేరు లేని ద‌ర్శ‌క నిర్మాత ఈ సినిమా టైటిల్ అభ్యంత‌రం క‌రంగా ఉంద‌ని.. సినిమాను చూసిన త‌ర్వాతే విడుద‌ల‌కు అనుమ‌తించాల‌ని .. ఎందుకంటే నోటా అనే ప‌దం ఎన్నిక‌ల్లో ఏ పార్టీకీ ఓటు వేయ‌వ‌ద్ద‌ని చెప్పే అప్ష‌న్‌. దాన్ని టైటిల్‌గా పెడితే .. అది త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే తెలంగాణ ఎన్నిక‌లపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని కేతిరెడ్డి వాద‌న‌. ఇది ఓ ర‌కంగా సినిమా ప‌బ్లిసిటీకి ఉప‌యోగ‌పడేదే.

ఇవ‌న్నీ కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దుప‌రి చిత్రం 'టాక్సీవాలా' కూడా ప‌శ్చిమ గోదావ‌రిలో పైర‌సీకి గుర‌య్యింద‌ని నిర్మాత‌లు ఆరోపిస్తున్నారు. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా విష‌యంలో కూడా ఫ్రీ ప‌బ్లిసిటీ జ‌రిగడం గ‌మ‌నార్హం. సినిమా జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. ఫ్రీ ప‌బ్లిసిటీ ప‌రంగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న సినిమాల‌పై హైప్‌ను క్రియేట్ చేసుకోవ‌డం స‌క్సెస్ అవుతున్నాడ‌న‌డంలో సందేహం లేదు.