తెలంగాణ సర్కార్‌కు ఎన్ని థ్యాంక్స్‌లు చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Saturday,December 25 2021]

సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి- టాలీవుడ్‌కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు మంత్రులు- సినీ ప్రముఖుల ఒకరిపపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం .. థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని విజయ్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంది అన్నారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద సినీ పరిశ్రమ అని విజయ్ దేవరకొండ చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘‘లైగర్’’. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ‘‘లైగర్’’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ , లాక్‌డౌన్‌ల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లైగర్‌ను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని ఇటీవల అనౌన్స్ చేశారు.