Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్ టైన్మెంట్స్ కొత్త చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అంటూ జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం ప్రకటన పోస్టర్ తోనే అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
పలువురు ప్రముఖుల సమక్షంలో బుధవారం (3-5-2023)ఉదయం 11:16 కి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో 'VD12' చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందజేశారు. ముహూర్తపు షాట్ కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా శ్రీ చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ 'జెర్సీ' చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతున్నారు. ఇక 'జెర్సీ'లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 'జెర్సీ'తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments