Kushi:'ఖుషీ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. విజయ్, సమంతల కెమిస్ట్రీ సూపర్బ్
- IndiaGlitz, [Tuesday,May 09 2023]
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషీ’’. ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటం.. పైగా సమంత, విజయ దేవరకొండ కాంబినేషన్ కావడం, దీనికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హిట్ మూవీ ‘‘ఖుషీ’’ పేరు పెట్టడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని ‘‘ఖుషీ’’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
స్వయంగా పాట రాసిన శివ నిర్వాణ:
‘‘నా రోజా నువ్వే’’ అంటూ సాగే ఈ పాట శివ నిర్వాణ ముందు సినిమాల స్టైల్‌లోనే వినసొంపుగా వుంది. ఇందులో సామ్‌ను ఇంప్రెస్ చేసేందుకు విజయ్ చేసే యత్నాలు చూపించారు. అంతేకాదు.. ఈ ప్రేమ కథలో హీరో హీరోయిన్లు వేర్వేరు మతాలవారీగా చూపించారు. సమంత ముస్లిం యువతిగా, విజయ్ దేవరకొండ హిందువుల కుర్రాడుగా కనినిస్తున్నారు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ రాయగా.. హషమ్ అబ్ధుల్ వహబ్ స్వరాలు సమకూర్చడంతో పాటు స్వయంగా ఆయనే ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు ‘‘ఖుషీ’’:
ఇకపోతే.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈసినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. సమంత విషయానికి వస్తే .. అమెరికన్ థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్'లో ఆమె నటిస్తున్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో సమంత , వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.