రాజకీయ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా
- IndiaGlitz, [Tuesday,March 06 2018]
సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి'తో దక్షిణాది పరిశ్రమలోనే హాట్ టాపిక్‌గా మారిపోయారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో ఏకంగా మూడు సినిమాలతో ఆయన సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. వాటిలో ఏ మంత్రం వేశావే' ఈ నెల 9న విడుదల కానుండగా.. టాక్సీవాలా' మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అతను కీలక పాత్రలో నటించిన 'మహానటి' కూడా వేసవిలోనే తెరపైకి రానుంది. ఇదిలా వుంటే.. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు ఈ వర్ధమాన నటుడు.
అందుకే తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన విభిన్నమైన కథతో.. తమిళంలో ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డారు విజయ్. తమిళంతో పాటు తెలుగులోనూ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఒక రాజకీయ నేత వారసుడిగా.. రాజకీయాలను, ప్రజలను ప్రభావితం చేసే పాత్రలో విజయ్ కనిపించనున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి' తరహాలో ఈ సినిమాని కూడా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముంది.