ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ
- IndiaGlitz, [Saturday,October 10 2020]
సంచలన హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ అంతా విజయ్‌ను ఓ రేంజ్‌లో అభిమానిస్తారు. విజయ్ ఆటిట్యూడ్‌ని యూత్ బాగా ఇష్టపడుతుంది. ఇక సమాజ సేవలో కూడా మనోడు ముందుంటాడు. లాక్‌డౌన్ సమయంలో కూడా పేద ప్రజానీకానికి తన వంతు సాయం అందించాడు. ప్రస్తుతం ఈ యంగ్ తాజాగా విజయ్ దేవరకొండ.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాజకీయాల గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని.. అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందన్నాడు. అలాగే ఓటు వేసే హక్కును అందరికీ ఇవ్వకూడదని పేర్కొన్నాడు. పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని, కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని రౌడీ హీరో స్పష్టం చేశాడు. అలాగే లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదని పేర్కొన్నాడు.
ఒక విమానం నడిపే పైలట్‌ని దానిలోకి ఎక్కే ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరని.. అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలని తెలిపాడు. కాబట్టి ఓటు హక్కు అందరికీ ఇవ్వడంలో అర్థం లేదన్నాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి.. కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.