'యమన్' క్రియేటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ - విజయ్ ఆంటోనీ
- IndiaGlitz, [Tuesday,February 21 2017]
విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీతో ఇంటర్వ్యూ.....
టైటిల్ గురించి...
యమన్ అంటే శివుడి అవతారం. అలాగే యమన్ అంటే యమధర్మరాజు అని కూడా అర్థం వస్తుంది. తప్పు చేసేవారికి యముడులాంటివాడు. ఈ సినిమాలో ఆ యముడిని కొత్త కోణంలో చూపడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో చెడు రాజకీయ నాయకులకు యముడు.
క్రియేటెడ్ స్టోరీ...
యమన్ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్. సినిమా కథను ఎలాంటి నిజ ఘటనల ఆధారంగా చేసుకుని తయారు చేయలేదు. ఈ కథ ఊహ. దర్శకుడు జీవ శంకర్ ఆలోచన నుండి క్రియేట్ చేయబడ్డ స్టోరీ. ఇం మొత్తం కల్పితమే. గతంలో నేను చేసిన నకిలీ' సినిమాలాగే యమన్ కల్పిత కథ.
మెయిన్ కాన్సెప్ట్ అదే...
ఈ సినిమాలో చూపించే మెయిన్స్ కాన్సెప్ట్ రాజకీయాలు ఎలా ఉంటాయనేదే. రాజకీయ నాయకుల ఆలోచనలు ఎలా ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతారు ఇలాంటి ఎలిమెంట్స్ సినిమాలో చూపిస్తాం. ప్రస్తుత తమిళ రాజకీయాలను ఈ సినిమాలో చూపించడం లేదు. ఎందుకంటే ముందు చెప్పినట్లు ఇదొక కల్పిత కథ. 5 ఏళ్ల క్రితమే ఈ కథ తయారైంది. రాజకీయాలను టచ్ చేసే యూనివర్సల్ కాన్సెప్ట్ మూవీ.
ముందు ఆ హీరోనే అనుకున్నారు..
నిజానికి యమన్ కథను విజయ్ సేతుపతిలో చేయాలని దర్శకుడు అనుకున్నారు. అయితే విజయ్ సేతుపతికి కథ నచ్చినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో డైరెక్టర్ జీవశంకర్ ఈ కథను నాకు చెప్పారు. నాకు కూడా కథ బాగా నచ్చడంతో నేను నటించడానికి రెడీ అయ్యాను.
భేతాళుడు ఫెయిల్యూర్‌కు కారణమదే...
నా గత చిత్రం భేతాళుడు' మంచి సబ్జెక్ట్. కానీ సరిగా ఆడలేదు. సినిమా రిలీజయ్యాక మేం చేసిన తప్పేమిటో తెలిసింది. అదేంటంటే విలన్లని ఫస్టాఫ్ లోనే రివీల్ చేసుండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో ఫస్టాఫ్ లో చెప్పిన జయలక్ష్మి పాత్ర వెనుక పెద్ద థ్రిల్లింగ్ కథ ఉంటుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ సెకండాఫ్ లో అలా లేదు. దాంతో రిజల్ట్ అనుకున్న విధంగా రాలేదు.
నేను అదే ఆలోచిస్తాను...
నేను, జోనర్ ఏంటి, డైరెక్టర్ కు సక్సెస్‌లున్నాయా అని ఆలోచించను. కథ బావుందా..అని మాత్రం చూస్తాను. కథ బాగుంటే పొలిటికల్ డ్రామా సినిమాలు వరుసగా చేస్తాను. సాధారణంగా ఒకే తరహా సినిమాలు వరుసగా చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందంటారు. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే ఒకే తరహా సినిమాలనైనా ఆడియన్స్ ఆదరిస్తారు.
సామాన్యమైన విషయం కాదు...
ఒక యాక్టర్, ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తే అతనికి నిర్మాత కష్టమేమిటో తెలుస్తుంది. సినిమాను నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. సినిమా చేసి, ప్రమోషన్ చేసి, డిస్ట్రిబ్యూషన్ చేసి చివరికి రిలీజ్ చేసేదాకా నిర్మాత కష్టపడాలి. ఒకసారి నిర్మాత కష్టం అర్థమైతే హీరోలు కూడా అన్ని విషయాల్లోనూ వారికి సహకరిస్తారు. నిర్మాతగా ఉండే టెన్షన్ నా వరకైతే లేదు. ఒక కథాపరమైన సినిమాకి నటుడు ఎలా ఉన్నాడు అనేది అవసరం లేదు. అందుకే ఫిజిక్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. గ్లామర్ కోసం కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోను.
నటనే సులభం...
టెక్నిషియన్ కంటే నటుడుకే సౌలభ్యం ఎక్కువ అని నా అభిప్రాయం. నా వరకు నటించడమే ఈజీగా ఉంటుంది. పైగా అందరూ చాలా ఈజీగా గుర్తుపడతారు. నటుడిగా ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్నీ టైంకి జరుగుతాయి. మంచి గౌరవం, మంచి ఆదాయం ఉంటాయి. మనం పర్సనల్ గా తెలీకపోయినా చాలా మంది మనల్ని ప్రేమిస్తారు. నేను గొప్ప నటుడ్ని కాను. అందుకే మంచి కథలు ఎంచుకుంటాను. అదే నాలోని మైనస్ పాయింట్స్ ని కవర్ చేస్తుంది.