'బిచ్చగాడు' సినిమా నచ్చిన ప్రేక్షకులకు 'ఇంద్రసేన' తప్పకుండా నచ్చుతుంది - విజయ్ ఆంటోని
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ తారాగణంగా రూపొందిన చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బేనర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. నవంబర్ 30న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని ఇంటర్వ్యూ...
ఇంద్రసేన సినిమా ఎలా ఉండబోతోంది?
ఇది వరకు నేను నటించిన 'యెమన్' తర్వాత డ్యూయల్ రోల్ లో నేను చేసిన సినిమా 'ఇంద్రసేన' . ఇంకా చెప్పాలంటే పూర్తిస్థాయిలో నేను చేసిన ద్విపాత్రాభినం ఇంద్రసేన సినిమాలో మీరు చూస్తారు. ఈ సినిమాలో రెండు పాత్రలుంటాయి. రెండు క్యారెక్టర్స్ నేను చేశాను. రెండూ సైమల్టేనియస్ గా నడుస్తాయి.
సినిమాలో రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
సినిమాలో ఇంద్రసేన, రుద్రసేనపైనే సినిమా ఉంటుంది. అన్న పాత్రలోని ఇంద్రసే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమెని కోల్పోతాడు. తాగుడుకు బానిస అవుతాడు. రుద్రసేన మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటాడు. వీళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరికీ ఒకటే సమస్య ఎదురవుతుంది. అప్పుడు వీళ్లు ఏం చేశారు.. అసలు సమస్య ఏంటనేదే కథ.
సినిమాల్లో ఈ ప్లానింగ్ ఎలా ఉంటుంది?
నిజం చెప్పాలంటే నేను మంచి నటుడ్ని కాదు. అందుకే మంచి కథల్ని ఎంచుకుంటాను. అన్ని ఎక్స్ ప్రెషన్స్ నేను పలికించలేను. అందుకే కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాను. కథలు బాగుంటే సినిమాలు ఆడతాయి. నాకు పేరొస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నా కెరీర్ ప్లానింగ్ ఇదే. నేను మంచి నటుడ్ని కాదు, మంచి టెక్నీషియన్ ను మాత్రమే.
ఇంద్రసేనను పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అని అనుకోవచ్చా?
నేను సినిమాలను కమర్షియల్ సినిమా అనో, మరేదో అని విభజించి చూడను. సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే నా దృష్టిలో అది కమర్షియల్ సినిమానే. ప్రతి ఒక్కరికీ సినిమాలు తీయడంలో ఒక్కొక్క పంథా ఉంటుంది. నా స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ ఇది. నటుడిగా నాకొక లిమిట్ ఉంది. అది నాకు తెలుసు. ఆ లిమిట్ దాటనంత వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను హీరోగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. నేను ఒక సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాననేది నాకు బాగా తెలుసు కాబట్టే, ఓ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాను. ఇంద్రసేన సినిమా బాగా వచ్చింది. 'బిచ్చగాడు' సినిమా నచ్చిన ప్రేక్షకులకు 'ఇంద్రసేన' తప్పకుండా నచ్చుతుంది.
బాగా డ్యాన్సులు వేసినట్లున్నారు?
ఇంకా నాకు డాన్స్ కూడా రాదు. నా సినిమాల్లో అన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి స్టెప్స్ వేయాల్సిన అవసరం రాలేదు. నేను డాన్స్ నేర్చుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందేమో. కాకపోతే ప్రత్యేకంగా డాన్స్ క్లాసులు తీసుకోను. ఏరోబిక్స్, జుంబా మాత్రం నేర్చుకుంటా. అప్పుడు ఆటోమేటిగ్గా డాన్స్ కూడా వస్తుంది కదా.
మాస్ సినిమాలు తీయాలనుకోరా?
పర్టికులర్‌గా మాస్ మసాలా సినిమాలు తీయాలని నేను అనుకోను. కథను బట్టే నా సినిమా ఉంటుంది. కాకపోతే మసాలా సాంగ్స్ పెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంద్రసేనలో కూడా మసాలా సాంగ్ ఉంది. నేనే కంపోజ్ చేశాను. కానీ పూర్తిస్తాయిలో మాస్ మసాలా సినిమాలు మాత్రం నేను తీయను.
సినిమాలో ముందు 10 నిమిషాలను ముందుగానే చెప్పేశారు కదా?
'ఇంద్రసేన'కు సంబంధించి కూడా 10 నిమిషాల సినిమాను ముందే చూపించాను. దీనికి కారణం కంటెంట్ పై నాకున్న నమ్మకమే. అందుకే ఈ సినిమాకు నేను నిర్మాతగా కూడా మారాను. ప్రస్తుతం టీజర్లు, ట్రయిలర్లు చూసి సినిమాకొచ్చే రోజులు పోయాయని నేను అనుకుంటున్నాను. అదే ట్రయిలర్ స్థానంలో నేను, నా సినిమాను 10 నిమిషాలు పాటు చూపిస్తే ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది.
థియేటర్ కు వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. 10 నిమిషాలు సినిమా చూపించడం వల్ల ఓపెనింగ్స్ పోతాయని నేను అనుకోను. దీనివల్ల మరో ఉపయోగం ఏంటంటే.. సినిమాపై ప్రేక్షకుడికి ఓ అంచనా వస్తుంది. ఇది ఏ జానర్ కు చెందిన సినిమా అనే విషయం అర్థంచేసుకుంటాడు. నచ్చితే థియేటర్ కు వచ్చి చూస్తాడు. అంతే తప్ప ఓపెనింగ్స్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపించదని నా అభిప్రాయం.
జిఎస్‌టి సాంగ్‌పై సెన్సార్ అభ్యంతరం చెప్పినట్లున్నారు కదా?
ఈ సినిమాలో జీఎస్టీ ప్రస్తావన ఉంది.కానీ ఎలాంటి విమర్శలు ఉండవు. ఓ సందర్భంలో ఆ అంశాన్ని టచ్ చేశాం. మనది చాలా పెద్ద దేశం, జనాభా కూడా ఎక్కువే. కాబట్టి జిఎస్‌టిపై అభిప్రాయాన్ని ఒకేసారి చెప్పలేం. జిఎస్‌టి వల్ల పాజిటివ్ ఏంటో, నెగటివ్ ఏంటో తెలియాలంటే ఎడేనిమిదేళ్ల సమయం పడుతుంది. ఇక ఈ సినిమాలో జీఎస్టీ సాంగ్ పై తమిళనాడు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తంచేసింది. అందుకే ఆ సాంగ్ లో జీఎస్టీ పదాన్ని తీసేశాం.
బయట సినిమాలకు మ్యూజిక్ చేయరా?
నేను ప్రస్తుతం నా సినిమాల్లో నటన, ప్రొడక్షన్ తదితర అంశాలతో బిజీగా ఉన్నాను. అలాగే నా సినిమాకు నేను ఎడిటర్ గా కూడా వర్క్ చేస్తాను. అందుకే ఇతర సినిమాలకు సంగీతం అందించలేకపోతున్నాను. నాపై ఖర్చుపెట్టే నిర్మాతల కోసం నేను వందశాతం అవుట్‌పుట్ ఇవ్వాలి. కాబట్టి ప్రస్తుతానికి వేరే సినిమాలకు అంత సమయాన్ని కేటాయించలేను.
అందుకే నాలుగైదేళ్లుగా ఇతర సినిమాలకు మ్యూజిక్ చేయడం లేదు. నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. హిందుస్థానీ, కర్ణాటక మ్యూజిక్ లాంటివి నాకేమీ తెలీదు… ఎప్పుడైతే నేను ట్యూన్స్ కంపోజ్ చేయగలను అని అర్థమయిందో, నేను నా ఫార్మాట్ లో మ్యూజిక్ కంపోజ్ చేయడం నేర్చుకున్నాను. నా సినిమాల్లో లైట్ మ్యూజిక్ ఎక్కువగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
ఇంద్రసేన తర్వాత రోషగాడు, కాళి అనే రెండు సినిమాలు చేయబోతున్నాను. తెలుగులో కాళి` టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే వివరాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments