సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్

  • IndiaGlitz, [Tuesday,December 13 2016]

విక్టరీ వెంక‌టేష్‌...సక్సెస్‌ను తన ఇంటిపేరుగా మార్చుకుని వరుస విజయాలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌తో విజయపథంలో దూసుకెళ్తున్న స్టార్‌ హీరో. తెలుగు ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌, మూవీ మొఘల్‌ డి.రామానాయుడు తనయుడైన వెంకటేష్‌..నిర్మాణ రంగం వైపు కాకుండా నటన పట్ల ఆసక్తితో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రేమనగర్‌లో బాలనటుడిగా కనిపించిన వెంకటేష్‌ హీరోగా మాత్రం 'కలియుగ పాండవులు' చిత్రంతో తెరంగేట్రం చేశారు. కథల ఎంపికలో మొనాటనీ కనిపించకుండా ఉండటానికి వెంకటేష్‌ అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. మాస్‌, క్లాస్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన హీరో కూడా వెంకటేష్‌ కావడం విశేషం.

నట ప్రస్థానం....

నటుడుగా మూడు పదులు అనుభవమున్న వెంకీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కలియుగ పాండవులు చిత్రం తర్వాత బ్రహ్మరుద్రులు, భారతంలో అర్జునుడు, విజేత విక్రమ్‌, శ్రీనివాస కల్యాణం, రక్త తిలకం, వారసుడొచ్చాడు, ప్రేమ, ధృవనక్షత్రం, టూ టౌన్‌ రౌడీ, బొబ్బిలిరాజా, శత్రువు, కూలీ నెం.1, సూర్య ఐ.పి.యస్‌, క్షణ క్షణం, చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, ముద్దుల ప్రియుడు, ధర్మ చక్రం, సాహసవీరుడు-సాగరకన్య, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, ప్రేమించుకుందాం..రా, పెళ్ళి చేసుకుందాం, కలిసుందాం..రా, సూర్యవంశం, గణేష్‌, ప్రేమంటే ఇదేరా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్‌, వసంతం, మల్లీశ్వరి, తులసి, లక్ష్మి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాల, గోపాల, బాబు బంగారం, గురు..ఇలా పలు విలక్షణ చిత్రాల్లో వెంకటేష్‌ తనదైన నటనతో మెప్పించి నిర్మాతల హీరో అనిపించుకున్నారు.

బాలీవుడ్‌లోనూ...

తెలుగులో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన చంటి చిత్రాన్ని హిందీలో అనారి అనే పేరుతో రీమేక్‌ చేశారు. అలాగే యమలీల చిత్రాన్ని తక్‌దీర్‌వాలా అనే పేరుతో బాలీవుడ్‌లో రాణించారు.

మల్టీస్టారర్‌ హీరో...

ఎప్పుడో ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈత‌రం హీరోల‌తో వెంకటేష్‌ మళ్లీ తెర తీశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌తో కలిసి మసాలా, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి గోపాల గోపాల చిత్రాల్లో నటించడమే కాకుండా కమల్‌హాసన్‌, అర్జున్‌, శ్రీకాంత్‌ ఇలా కథ బావుంటే ఏ హీరోతో అయినా నటించి క‌థ బావుంటే న‌టించడానికి తాను సిద్ధమేనని తెలియజేశారు వెంకటేష్‌.

అవార్డ్స్‌...

1986లో వెంకటేష్‌ హీరోగా పరిచయమైన 'కలియుగ పాండవులు'తోనే నంది అవార్డును కైవసం చేసుకున్న వెంకటేష్‌ 1988లో 'బ్రహ్మపుత్రుడు' చిత్రంతో ఫిలింఫేర్‌ అవార్డుని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది స్వర్ణ కమలం చిత్రంతో మరోసారి బెస్ట్‌ యాక్టర్‌గా నంది అవార్డును సంపాదించుకున్నారు. 1989లో ప్రేమ చిత్రంతో నంది అవార్డును సాధించిన విక్టరీ వెంకటేష్‌ 1995లో విడుదలైన ధర్మచక్రం సినిమాతో నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్‌ అవార్డును సంపాదించుకున్నారు. 1998లో విడుదలైన గణేష్‌ చిత్రంతో మరోసారి నంది అవార్డును, ఫిలింఫేర్‌ అవార్డులను గెలుచుకున్నారు. రాజా, కలిసుందాం రా, సంక్రాంతి చిత్రాలకు ఫిలింఫేర్‌ అవార్డులను సాధించిన వెంకటేష్‌ తర్వాత ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే చిత్రానికి నంది అవార్డును, 2015లో విడుదలైన దృశ్యం చిత్రానికి ఫిలిం ఫేర్‌ అవార్డును గెలుచుకున్నారు.

డిఫరెంట్‌ 'గురు'గా...

విక్టరీ వెంకటేష్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వైనాట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎస్‌.శశికాంత్‌ నిర్మిస్తున్న చిత్రం 'గురు'. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన 'సాలా ఖద్దూస్‌' చిత్రాన్ని తెలుగులో 'గురు'గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ మరోసారి విభిన్నమైన పాత్ర బాక్సింగ్‌కోచ్‌గా కనపడనున్నారు. రితిక సింగ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'నేను శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో మరో డిఫరెంట్‌ రోల్‌లో నటించబోతున్న వెంక‌టేష్ పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 13. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు....
......హ్యాపీ బ‌ర్త్ డే టు విక్ల‌రీ వెంక‌టేష్‌ ........