Rana Naidu : వెంకీ నోటి వెంట బండ బూతులు.. ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ..?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలుగా వున్న అగ్రకథానాయకుల్లో ఆయన కూడా ఒకరు. క్లాస్, మాస్, కామెడీ ఇలా జోనర్‌లోనైనా అద్భుతంగా నటించగల సత్తా వున్న అరుదైన నటుల్లో వెంకీ ఒకరు. టాలీవుడ్లో ఎక్కువ రీమేక్‌లు చేసిన నటుడిగా వెంకటేష్‌గా పేరుంది. ప్రస్తుతం వయసు రీత్యా కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకీ. నవతరం స్టార్లతోనూ జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు. కలియుగ పాండవుల నుంచి నిన్నటి ఎఫ్3 వరకు ఆయన తెలుగువారిని తన విలక్షణ నటనతో అలరిస్తున్నారు. అంతేకాదు దాదాపు నలభై యేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎలాంటి వివాదం కానీ, మచ్చ కానీ లేని అరుదైన వ్యక్తిత్వం వెంకటేశ్‌ది.
ఓటీటీ క్రేజ్‌ను ముందే అంచనా వేసిన వెంకీ:
ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుండటంతో దీనికి వున్న మార్కెట్‌ను, పరిధిని దృష్టిలో వుంచుకుని ముందే ఈ రంగంలోకి ప్రవేశించిన తొలి సీనియర్ హీరో వెంకీనే. ఆయన నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యాయి. ఇక ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన‘ఓరి దేవుడా’ సినిమాలో దేవుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘‘కిసీకా భాయ్, కిసీ కా జాన్’’ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత హిందీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు వెంకీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ‘రానానాయుడు’ అనే వెబ్‌సిరీస్‌లో తన అన్న కొడుకు రానాతో కలిసి నటిస్తున్నారు.
వెంకీ నోటి వెంట బూతులు:
అయితే రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వెంకీ నోటి నుంచి వచ్చిన డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. క్రమశిక్షణకు, డీసెన్సీకి కేరాఫ్‌గా.. కాంట్రవర్సీకి దూరంగా వుండే వెంకటేష్ నోటి వెంట బూతులు రావడాన్ని ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యాన్ బేస్‌లో పెద్ద సంఖ్యలో వుండే మహిళా ప్రేక్షకులు మరింత బాధపడుతున్నారు. రానా నాయుడులో రూత్‌లెస్ క్రిమినల్‌గా తనలోని కొత్త కోణాన్ని చూపించిన ఆయన.. దారుణంగా బూతులు మాట్లాడాడు. హిందీలో నేరుగా వీటిని పెట్టేసేటప్పటికీ.. తెలుగులో మాత్రం కాస్త కట్ వాడారు. ఇందులో ఆయనను తప్పుబట్టడానికి ఏం లేదు. దర్శక నిర్మాతలు చెప్పింది చేయడం ఆయన విధి. ఇక ఓటీటీని ఎక్కువగా వీక్షించేది యువతే కాబట్టి.. వాళ్లకు నచ్చే అంశాలనే కథల్లో చేరుస్తారు. అందువల్ల తన పాత్రకు తగినట్లుగా వెంకి మేకోవర్ అయ్యారని కొందరు అంటున్నారు. అయితే ఆయన నుంచి ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయని వారు మాత్రం కాస్త నిరాశకు గురవ్వక తప్పదు.
మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు:
ఇకపోతే.. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు స్ట్రీమింగ్ కానుంది. రానా , వెంకటేశ్‌లతో పాటు సుచిత్ర పిళ్లై, సుర్విన్ చావ్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. కరణ్ అన్షుమన్, సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments