venkaiah naidu : మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు దేశాల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మే 30 నుంచి జూన్ 7 వరకు జరిగే ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి గెబోన్, సెనెగల్, ఖతార్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, పార్లమెంటు సభ్యులు సుశీల్ కుమార్ మోదీ (రాజ్యసభ), విజయ్ పాల్ సింగ్ తోమర్ (రాజ్యసభ), పి.రవీంద్రనాథ్ (లోక్‌సభ) కూడా ఉన్నారు. ఈ పర్యటనలో మూడు దేశాలతో కీలకమైన అంశాల్లో భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
ఈ మూడు దేశాల్లోనూ భారతదేశ ఉపరాష్ట్రపతి పర్యటించడం ఇదే ప్రథమం. గెబాన్, సెనెగల్ దేశాల్లో ఇండియా ఉన్నతస్థాయి చర్చలు జరపడం కూడా ఇదే తొలిసారి. ఉపరాష్ట్రపతి చేపట్టిన ఈ పర్యటన ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలతో భారతదేశ సంబంధాల్లో మరింత పురోగతి కనిపించనుంది.
మే 30 నుంచి జూన్ 1 వరకు గెబాన్ పర్యటన:
మే 30 నుంచి జూన్ 1 వరకు గెబాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని రోస్ క్రిస్టైన్ ఒసుంకా రాపొండా, అధ్యక్షుడు అలీ బోంగో ఒండిబాతోపాటు ఇతర ఉన్నతాధికారులతో వెంకయ్య నాయుడు చర్చలు జరపనున్నారు. అనంతరం గెబాన్‌లోని భారత సంతతి పారిశ్రామిక వేత్తలతో, అక్కడి భారత సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి సమావేశమవుతారు.
జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్ పర్యటన:
జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు మేకీ సాల్, సెనెగల్ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు మౌస్తఫా నియాసీతోపాటు ఇతరులతో ఉపరాష్ట్రపతి చర్చలు జరపనున్నారు. భారత్-సెనెగల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ కూడా భారతీయ సంతతివారితోపాటు మన వ్యాపారవేత్తలతో ఉప రాష్ట్రపతి సమావేశమవుతారు.
జూన్ 4 నుంచి 7 వరకు ఖతార్ పర్యటన:
జూన్ 4 నుంచి 7 వరకు జరగనున్న ఖతార్ పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ థానీతో వెంకయ్య నాయుడు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ఖతార్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో సంభాషిస్తారు. పర్యటన ముగింపునకు ముందు ఖతార్‌లోని భారత సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి ముచ్చటిస్తారు. ఖతార్‌తో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com