వైఎస్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు...
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎవరో ఒకరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనో.. సంచలన వ్యాఖ్యలు చేస్తూనో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్థన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగానే వైఎస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్‌కు తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని అప్పట్లో వైఎస్ ప్రయత్నాలు చేశారన్నారు.
పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని వైఎస్ తనకు ఆఫర్ ఇచ్చారన్నారు. కానీ వైఎస్ ఆఫర్‌ను తాను తిరస్కరించానని వీహెచ్ వెల్లడించారు. ఒకవేళ అప్పట్లో వైఎస్ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే తాను ఎంతో సంపాందించే ఉండేవాడినన్నారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం పీజేఆర్‌ను ప్రజలు మరువలేరన్నారు. తాగునీటి కోసం పోరాటం చేశారని... ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇప్పించారన్నారు. తెలంగాణ కోసం మొదట పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ కొనియాడారు. కాగా.. నేడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సైతం వీహెచ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ అభిమానులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతి రేవంత్ తెస్తున్నాడని వీహెచ్ ఫైర్ అయినట్టు సమాచారం.
కాగా.. పీసీసీ చీఫ్ పదవిని ఎంపీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై వీహెచ్ ఏ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీని వీడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేవంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో రేవంత్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. ఆయన అభిమానులు.. వీహెచ్‌కు ఫోన్ చేసి మరీ తిట్ల దండకం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్‌కు వీహెచ్ ఫిర్యాదు చేశారు. తన అభిమానులను రేవంత్ నియంత్రించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, ఆయన అభిమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments