కమెడియన్ వివేక్ కన్నుమూత
- IndiaGlitz, [Saturday,April 17 2021]
కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ కమెడియన్ వివేక్(59) గుండెపోటుతో శనివారం ఉదయం ఐదు గంటలకు కన్నుమూశారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. శుక్రవారం ఉదయం వివేక్ స్థానిక సాలిగ్రామంలోని తన నివాసంలో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ వివేక్‌ను చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ వివేక్ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎంటైర్ సినీ ఇండస్ట్రీ వివేక్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
కోవిడ్ టీకా వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే టీకాకు గుండెపోటు సంబంధం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వివేక్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఆరేళ్ల ముందు వివేక్ కుమారుడు డెంగీ జ్వరంతో మృతి చెందారు. కమెడియన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వివేక్‌ను తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలు సైతం బాగా ఇష్టపడతారు. హెల్దీ కామెడీతో ప్రేక్షకాభిమానులనే కాదు.. సెలబ్రిటీలను సైతం వివేక్ ఆకట్టుకున్నారు. అలాగే టీవీ హోస్ట్‌గా అబ్దుల్ కలాం, ఎ.ఆర్.రెహమాన్ వంటి ప్రముఖులతో అద్భుతమైన ఇంటర్వ్యూలను చేసి మెప్పు పొందారు.
వివేక్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. 'మనదిల్ ఉరుది వేండం' ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు.
వివేక్ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కావడం విశేషం. సామాజిక సేవా కార్యక్రమాలకు సైతం వివేక్ ఎప్పుడూ ముందుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవగాహనా కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తూ ఉండేవారు. తమిళనాట దాదాపు అగ్ర హీరోలందరి చిత్రాల్లో నటించారు. వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ సంరక్షణకు మద్దతుగా ఆయన పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.