అనాథ పిల్లల గురించి చెప్పే 'వేటపాలెం'
- IndiaGlitz, [Monday,January 04 2016]
హని, ప్రణి ఫిలింస్ బ్యానర్ పై డా.ఎ.వి.ఆర్ నిర్మాతగా మాస్టర్ అమరావతి సురోచన్ సమర్పణలో నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వేటపాలెం'. ప్రశాంత్, లావణ్య, శిల్ప హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్.సన్నీ సంగీతమందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక ఆదివారం (3.1.2016) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్య్వూ థియేటర్ లో జరిగింది. ఆడియో సిడీలను బేబి శ్లోక ఆవిష్కరించింది. తొలి సీడీని దైవజ్ఞశర్మ స్వీకరించి చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం నిర్మాత డా.ఎ.వి.ఆర్ మాట్లాడుతూ - ''నిర్మాతగా నాకిది తొలి చిత్రం. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ, ఆళ్లగడ్డలో లలితాకళా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అలా నాకు డైరెక్టర్ నంది వెంకటరెడ్డి తో పరిచయం ఏర్పడింది. ఆయన చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. చిత్ర పరిశ్రమతో పెద్దగా పరిచయం లేనప్పటికీ అందరూ సహకరించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చేయగలిగాను. మంచి మెసేజ్ కూడా ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరోయిన్ శిల్ప చక్కగా నటించింది. సన్నీ మంచి పాటలందించారు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను '' అని చెప్పారు.
దర్శకుడు నంది వెంకటరెడ్డి మాట్లాడుతూ - ''అనాథ పిల్లలకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల క్రిమినల్స్ గా మారుతున్నారు. వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మనసును తాకే సన్నివేశాలు ఉంటాయి. గణేష్ ముత్యాల అందించిన కథ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. నిర్మాతగారు పూర్తిగా స్వేచ్ఛనివ్వడం వల్ల నేను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించగలిగాను. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు'' అన్నారు.
ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ - ''చిత్ర నిర్మాత డా.ఎ.వి.ఆర్ నాకు మంచి మిత్రుడు. ఆయన నిర్మాతగా మారి అనాధ పిల్లల మీద ఓ సినిమా తీయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తే, ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని నమ్ముతున్నాను'' అని తెలిపారు.
సంగీత దర్శకుడు సన్నీ మాట్లాడుతూ - ''డైరెక్టర్ నంది వెంకటరెడ్డిగారితో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. చక్కటి పాటలు కుదిరాయి. అందరికీ నచ్చే విధంగా పాటలుంటాయి. సినిమాని ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
హీరో ప్రశాంత్, హీరోయిన్ శిల్ప మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇంకా ఈ ఆడియో వేడుకలో పాల్గొన్న అతిధులందరూ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ చిత్రానికి కెమెరా - డి.యాదగిరి, సంగీతం - ఎ.ఆర్.సన్నీ, పాటలు - నర్ల రామకృష్ణా రెడ్డి, మాటలు, కోడైరెక్టర్ - గణేష్ ముత్యాల, సహ నిర్మాత - తంగిరాల అపర్ణ, నిర్మాత - డా.ఎ.వి.ఆర్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - నంది వెంకటరెడ్డి.