నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం కొత్తగా ఉంది - వెన్నెల కిషోర్

  • IndiaGlitz, [Tuesday,May 23 2017]

ఇప్ప‌టి వ‌ర‌కు కామెడి పాత్ర‌ల‌తో మెప్పించిన వెన్నెల‌కిషోర్ ఇప్పుడు అమీ తుమీ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఈ సినిమా జూన్ 2న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వెన్నెల‌కిషోర్ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు.

'అమీ తుమీ' చిత్రంలో అవ‌స‌రాల‌, అడివిశేష్ ఇద్ద‌రూ హీరోలు. నేను వాళ్ల‌కి మిత్రుడిని కాదు.వాళ్లిద్ద‌రికీ ల‌వ్ స్టోరీలుంటాయి. పెళ్లి కోస‌మ‌ని వైజాగ్ నుంచి హైద‌రాబాద్‌కు ఒక‌రోజు ఉద‌యం నేను బ‌య‌లుదేరుతాను. ఆ త‌ర్వాత ఏమైంద‌నేది అస‌లు సినిమా. నా పాత్ర ప‌రంగా నెగ‌టివ్ షేడ్‌లు చాలా ఉంటాయి. ఇందులో నా పాత్రే కాదు పేరు కూడా కొత్త‌గా ఉంటుంది. నెగ‌టివ్ పాత్ర చేయ‌డం కొత్త‌గా అనిపించింది.

జెంటిల్ మేన్ సినిమా నుండి డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటిగారితో మంచి అసోషియేష‌న్ ఉంది. ఆయ‌న‌కు ఏం కావాలో అది బాగా తెలిసిన వ్య‌క్తి. మా ఇంద్ర‌గంటి గారు సినిమాకు రెండు నెల‌ల‌కు ముందే ఆర్టిస్టుల‌కు స్క్రిప్ట్ ను పంపేస్తారు. ఈ చిత్రానికి కూడా ఒక‌రోజు అలాగే పంపించారు. ఒక‌రోజు ఆవాసా హోట‌ల్లో పెద్ద హాల్ బుక్ చేసి న‌టీన‌టుల్ని అంద‌రినీ పిలిపించి స్క్రిప్ట్ రీడింగ్ చేయించారు. దాంతో ఎవ‌రికీ స్పాట్‌లో డౌట్‌లు రావు. పైగా వ‌ర్క్ స్పీడ్‌గా జ‌ర‌గ‌డానికి ఈ సెష‌న్స్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోవాల్సిందే. లేకుంటే ప్ర‌తి శుక్ర‌వారం ఇక్క‌డ ఓ కొత్త క‌మెడియ‌న్ వ‌స్తుంటారు. వాళ్ల మ‌ధ్య మ‌నం ఉండ‌లేం. ఈ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఉండాలంటే ఏదో ఒక‌టి చేస్తూనే ఉండాలి. ఈ మ‌ధ్య కేశ‌వ‌లో నా పాత్ర‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. మారుతి ఈ సినిమాను చూసి 'నిన్ను ఇలా కూడా వాడుకోవ‌చ్చా' అని అన్నారు. ఫ్యామిలీ జోన్‌లోకి వెళ్ల‌డానికి ఇది మంచి ఛాన్స్ అనిపించింది.