రామానాయుడు చిహ్నంగా స్పెషల్ ట్రీ లాంఛ్ చేసిన సురేష్ బాబు, వెంకటేష్, రానా
- IndiaGlitz, [Sunday,June 05 2016]
భారతీయ భాషలన్నింటిలో సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించిన గొప్ప నిర్మాత స్వర్గీయ రామానాయుడు. ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసి తెలుగు సినిమాకు ఎంతగానో సేవ చేసారాయన. స్టార్ ప్రొడ్యూసర్ గా, మూవీ మొఘల్ గా ప్రేక్షక హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయిన రామానాయుడు జయంతి (జూన్ 6). ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ...మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో..అలాగే ఇండస్ట్రీలో కొత్త వాళ్లను ప్రొత్సహిస్తూ తెలుగు సినిమా అభివృద్దికి ఎంతగానో కృషి చేసారు. కుటుంబాన్ని, సినిమా పరిశ్రమను ఆయన ముందుకు నడిపించిన విధానం తెలియచేసేలా నాన్నగారి జయంతి సందర్భంగా స్టూడియోలో నాన్నగారి గుర్తుగా ఓ చెట్టు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు ఉన్నట్టుగా ఏర్పాటు చేసాం. ఈ స్టూడియోలోకి వచ్చే ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కి,ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి వచ్చే వారికి ఇది స్పూర్తి కలిగిస్తుంది అనేది నా ఆశ. ఈ స్పెషల్ ట్రీ ని మా సిస్టర్, ఆర్ట్ డైరెక్టర్ నందు కలిసి డిజైన్ చేసారు.
రేపు నాన్నగారి జయంతి సందర్భంగా వైజాగ్ లో మ్యూజియమ్ ఆఫ్ సినిమాని లాంఛ్ చేస్తున్నాం. మన సినిమా చరిత్రను భద్రపరుచుకోవడం ఇక నుంచైనా అలవాటు చేసుకోవాలి. నాన్నగారు నర్సాపూర్ లో అగ్రికల్చరల్ & ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేసారు. అలాగే నాన్నగార్కి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. అందుచేత రైతులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కృషి విజ్ఞాన కేంద్రం మెదక్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇక సినిమాల విషయానికి వస్తే...గోపాల గోపాల తర్వాత సినిమా తీయలేదు. త్వరలోనే కొత్తవాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తాను అన్నారు
వెంకటేష్ మాట్లాడుతూ...నాన్నగారు వండర్ ఫుల్ పర్సన్. అలాగే ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మానవతావాది. ఉన్నత విలువలతో ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉంటుందని నమ్మి ఎందర్నో ప్రొత్సహించారు. అందుకే ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయారు అన్నారు.
రానా మాట్లాడుతూ...తాతగారు విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ముందుకు తీసుకువెళ్లారు అన్నారు.