ఈ మధ్య ఆసక్తి రేపిన మూవీ కాంబినేషన్స్‌లో `వెంకీమామ` ఒకటి. నిజ జీవితంలో మామ, అల్లుడైన వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య సినిమాలోనూ అదే పాత్రల్లో నటించారు. అసలు వీరి మధ్య బంధాన్ని దర్శకుడు బాబీ తెరపై ఎలా అవిష్కరించాడు. సినిమా పరిశ్రమకు చెందిన రెండు పెద్ద కుటుంబాల హీరోలు కలిసి నటించిన చిత్రంతో పాటు.. ఇద్దరు స్టార్ హీరోలు వెంకటేశ్, చైతన్య కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రియల్ మామ అల్లుళ్లు రీల్‌పై ఎలా మెప్పించారు? అనే విషయాలు తెలియాలంటే ముందుగా కథలోకి వెళదాం.
కథ:
కార్తీక్ శివరాం(అక్కినేని నాగచైతన్య) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. నష్టజాతకుడు అని తండ్రి వద్దని వారిస్తున్నా.. వెంకటరత్నం(విక్టరీ వెంకటేష్) మేనల్లుడుని పెంచి పెద్దచేస్తాడు. మేనల్లుడు కోసం పెళ్లి కూడా చేసుకోడు. పెరిగి పెద్దయిన కార్తీక్‌కి కూడా మావయ్య అంటే పంచ ప్రాణాలు. తన కోసం లండన్‌లో ఉద్యోగాన్ని వదులుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి(రాశీఖన్నా)ను వదులుకుంటాడు. తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన మావయ్య కోసం తనే సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్ వెన్నెల(పాయల్ రాజ్‌పుత్)కి, మావయ్యకి మధ్య లవ్ పుట్టేలా చేస్తాడు కార్తీక్. మరో వైపు వెంకటరత్నం కూడా అల్లుడు కార్తీక్ తన కోసం ప్రేమను వదులుకున్నాడని తెలుసుకుని ఆ అమ్మాయితో మాట్లాడి వారిద్దరినీ ఒకటి చేస్తాడు.
ప్లస్ పాయింట్స్:
- వెంకటేశ్
- ఫస్టాఫ్
- కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్
- ఎమోషనల్ సీన్స్ కనెక్టింగ్‌గా లేకపోవడం
- క్లైమాక్స్
విశ్లేషణ:
సాధారణంగా అమ్మ, నాన్న, పిల్లలు మధ్య ఉండే అనుబంధాలపై వచ్చిన సినిమాలకు భిన్నంగా మామ, అల్లుడు మధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా రూపొందిన చిత్రం ` వెంకీమామ`. వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటిండచంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దర్శకుడు బాబీ రియల్ లైఫ్ మామ, అల్లుడిని రీల్ లైఫ్ మామ అల్లుడిగా చక్కని రిలేషన్స్ ఉన్న సీన్స్‌తో ఎలివేట్ చేశాడు. వారి మధ్య అనుబంధాలకు చూపించే సన్నివేశాలు, ఒకరిపై మరొకిరికి ఉన్న ప్రేమ సబంధిత సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకటేశ్ టైటిల్ రోల్‌ను అద్భుతంగా క్యారీ చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు హీరోలున్నప్పటికీ తన సీనియారిటీ ప్రకారం వెంకీ తనదైన కామెడీతో సన్నివేశాలను పండించాడు. చైతన్య కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఇదే కొత్త అని చెప్పాలి. ఎమోషనల్ పాత్రలో బాగానే చేసినా.. ఇంకా బాగా చేసి ఉండొచ్చుననిపించింది. రాశీఖన్నా కంటే ఇక పాయల్ రాజ్‌పుత్ పాత్రకు ఎక్కవ ఎలివేషన్ ఉంది. రాశీఖన్నా తన గత చిత్రాలతో పోల్చితే కాస్త గ్లామర్‌గానే కనిపించే ప్రయత్నం చేసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ విలన్‌గా రావు రమేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు చేయడం రావు రమేష్‌కి కొత్తేం కాదు.. దాసరి అరుణ్ కూడా విలన్‌గా బాగానే చేశాడు. ఇక నాజర్, నాగినీడు, హరీష్ ఉత్తమన్, ఆదిత్యమీనన్, ప్రకాష్ రాజ్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, శివన్నారాయణ, విద్యుల్లేఖా రామన్, అదుర్స్ రఘు, చారుహాసన్ తదితరులు వారి వారి పాత్రలకు పరిధి మేర చక్కగా నటించారు.
జాతకం గొప్పదా?, ప్రేమ గొప్పదా? అనే పాయింట్‌ను బేస్ చేసుకని దర్శకుడు బాబీ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ ఇంట్రడక్షన్స్, సాంగ్స్, వారి మధ్య కామెడీ సన్నివేశాలు, ఫైట్స్‌తో సినిమా ఆకట్టుకుంటుది. ఇక సెకండాఫ్ అంతా కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆర్మీ చుట్టూనే తిరుగుతుంది. ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం యూనిట్ బాగానే కష్టపడింది. అయితే ఆ సన్నివేశాలను ఎమోషనల్‌గా మాత్రం చిత్రీకరించలేకపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. బాబీ అండ్ యూనిట్ ఈ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండుంటే బావుండేదనిపించింది. ఎమోషన్స్‌ను బలంగా పండించాల్సిన తరుణంలో ఆ ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. తమన్ అందించిన సంగీతంలో రెండు పాటలు ముఖ్యంగా వెంకటేశ్, పాయల్ మధ్య వచ్చే రెట్రో సాంగ్, కో కో కోలా పెప్సీ సాంగ్స్ బావున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్లను రీల్‌పై చూసింఎంజాయ్ చేయాలనుకునేవారికి నచ్చేసినిమా.
చివరగా.. జాతకం కంటే ప్రేమే గొప్పదని నిరూపించే `వెంకీమామ`
Comments