దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ కలయికలో 'రానా నాయుడు'... త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
- IndiaGlitz, [Wednesday,September 22 2021]
విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటిస్తే చూడాలన్నది దగ్గుబాటి అభిమానుల కల ఇన్నాళ్లకు నెరవేరనుంది. గతంలో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించాడు. కానీ ఇద్దరూ పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. అలాంటిది వీరిద్దరూ కలిసి వెబ్ సీరిస్‌కు సై అనేశారు. దీనికి ‘రానా నాయుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్ ఆధారంగా ‘రానా నాయుడు’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఈ వెబ్ సీరిస్ లో నటించడం పట్ల రానా హర్షం వ్యక్తం చేశాడు. అలానే నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి పనిచేయడం కూడా ఆనందంగా ఉందన్నాడు.
బాలీవుడ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చిన వారి కేరాఫ్ అడ్రస్ ‘రానా నాయుడు’. సో… ఆ పాత్ర చుట్టూనే ఈ వెబ్ సీరిస్ మొత్తం నడుస్తుంది. కరన్ అన్షుమాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా... సుపర్న్ వర్మ కో-డైరెక్టర్. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. అమెరికన్ వెబ్ సీరిస్ ‘రే డొనోవన్’ కు తాను గొప్ప అభిమానిని అని, దాని రీమేక్ లో నటించడం ఆనందంగా వుందన్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ వెబ్ సీరిస్ ను రూపొందిస్తున్నామని, ఇటు వెంకటేశ్ – అటు రానా ఇద్దరూ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనే నమ్మకం ఉందని లోకోమోటివ్ గోబ్లల్కు చెందిన సుందర్ అరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.