సెన్సార్ కు ముందే హ్యాండిచ్చేశారు : డి. వెంకటేష్
- IndiaGlitz, [Thursday,November 24 2016]
తెలుగు వెర్షన్ రిలీజ్‌కి తగినంత సమయం ఇవ్వకుండా తమిళ నిర్మాతలు మమ్మల్ని బుక్ చేసేశారు. నవంబర్ 24న తెలుగు, తమిళ్ రెండుచోట్లా రిలీజ్ అంటూ ప్రకటించినా తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి కాలేదింకా. కనీసం సెన్సార్ కైనా టైమ్ లేకుండా పోయింది. ఈలోగానే తమిళ నిర్మాతలు అక్కడ సినిమాని రిలీజ్ చేసి మమ్మల్ని అడ్డంగా బుక్ చేసేశారు. తెలుగు వెర్షన్ రాకుండానే తమిళ్‌లో సినిమా రిలీజైపోవడం మాకు తీవ్ర నష్టం కలిగిస్తుంది'' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాత, డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్. జీవా- కాజల్ జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం' తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'యామిరుక్క బయమేన్' ఫేమ్ డీకే దర్శకత్వం వహించారు. అన్నిపనులు పూర్తయిన ఈ చిత్రం సెన్సార్ ముంగిట ఉంది. అయితే ఈలోగానే తమిళ వెర్షన్ రిలీజ్ చేసేశారు. సైమల్టేనియస్ రిలీజ్ కోసం వేచి చూస్తామని చెప్పినా.. ఛాన్సివ్వకుండా ఇలా చేశారని 'ఎంతవరకు ఈ ప్రేమ' నిర్మాత డి.వెంకటేష్ ఆరోపించారు.
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ '' రంగం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంతవరకు ఈ ప్రేమ'. ఇదో పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు డీకే తెరకెక్కించారు. పాటలు, ట్రైలర్లకు చక్కని స్పందన వచ్చింది. మా బ్యానర్‌కి పేరు తెచ్చే చిత్రమిది. అయితే మాకు సెన్సార్‌కు కనీస సమయం లేకుండానే తమిళ వెర్షన్‌ని రిలీజ్ చేసేశారు. అక్కడ రిలీజ్ రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయన్న టాక్ వచ్చింది. జీవా తన కెరీర్‌లోనే క్రేజీ ఓపెనింగ్స్‌తో మరో బ్లాక్‌బస్టర్ అందుకోబోతున్నాడు. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నాం. తెలుగు ఆడియెన్‌లో జీవాకి వీరాభిమానులున్నారు. జీవా ఫ్యాన్స్‌కి క్షమాపణ చెబుతున్నాం. సాధ్యమైనంత తొందర్లోనే సినిమా రిలీజ్ చేస్తాం'' అన్నారు.
బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.