ఊపిరి చిత్రానికి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 'పివిపి బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ నిర్మించిన చిత్రం ఊపిరి ఎంతో చక్కగా ఉంది. ఎంతో ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా అర్థవంతమైన విలువలతో అఖరి వరకు సినిమా సాగింది. సినిమా అన్న తర్వాత వినోదమన్నా ఉండాలి, వ విజ్ఞాన‌మన్నా, సందేశమైనా ఉండాలి. ఈ చిత్రంలో ఈ మూడు అంశాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, నాగేశ్వరరావుగారితో పోటీపడి నటించాడు. క్లిష్టమైన పాత్ర, అందులో అందరి మనసులు చూరగొనే విధంగా నటించడం గొప్ప విషయం. కార్తీ కూడా చాలా సహజంగా, ఉషారుగా నటించాడు. సినిమా నాకైతే బాగా నచ్చింది. మంచి కథ, నటన, సందేశం ఉంటే సినిమా చక్కగా ఆడుతుందని నిరూపించిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. ప్రేమ, అనురాగం, అనుబంధం వాటి సమ్మిళితం బాగా నచ్చింది. ఉద్వేగంగా ఉంది. పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని అనుకునే ఈరోజుల్లో ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమా రావడం సంతోషం. ఈ చిత్రంలో నటించిన నటీనటుల, పనిచేసిన టెక్నిషియన్స్ ను అభినందిస్తున్నాను. ఇంత మంచి సినిమా తీసిన పివిపిగారికి నా ప్రత్యేకమైన అభినందనలు'' అన్నారు.

నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ 'మా ఊపిరి చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. కేంద్రమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడుగారు రాత్రి నాకు ఫోన్ చేసి సినిమా గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా సినిమా బాగా ఆడుతుందని తెలిసింది. సినిమా చూడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఆయన కోసం ఈ స్పెషల్ షో ఏర్పాటు చేశాం. నాగార్జునగారిని, కార్తీని, వంశీ పైడిపల్లితో పాటు యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించినందుకు హ్యపీగా ఉంది. ఆయనకు నా కృత‌జ్ఞ‌త‌లు'' అన్నారు.