Vemula Rohit:వేముల రోహిత్ దళితుడు కాదు.. కేసు మూసివేసిన పోలీసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని స్పష్టంచేశారు. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్ మాజీ ఎంపీ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఉపశమనం లభించింది.
కాగా 2016లో హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దళితుడైన రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ రోజుల తరబడి నిరసనలు జరిగాయి. దీంతో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను సైతం పోలీసులు జోడించారు. అయితే తాజాగా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
ఇక పోలీసులు తాజా రిపోర్టుపై వేముల రోహిత్ సోదరుడు రాజా స్పందించారు. పోలీసుల వాదన అసంబద్దమైనదని.. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో కూడా అర్థం కావడంలేదని వాపోయారు. రేపు(శనివారం) సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని తమ కుటుంబం భావిస్తోందని తెలిపారు. కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని.. 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments