Vemireddy Prabhakar Reddy: అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయంలో అధికార వైపీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం జగన్‌కి రాజీనామా లేఖ పంపించారు.
"నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.
అలాగే రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ లేఖలో తెలిపారు. అంతేకాకుండా ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు. త్వరలోనే ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు వేమిరెడ్డి దూరంగా ఉంటున్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం జగన్ ఆయనను ఖరారు చేశారు. అయితే పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని కోరారు. అయితే అందుకు జగన్ అంగీకరించలేదు. ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంచి తన సతీమణి ప్రశాంతి రెడ్డి చేత పోటీ చేయించాలని భావించారు. కానీ జగన్ మాత్రం ఆయన మాటను కాదని.. అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు ఖలీల్‌కి టికెట్ ఖారారుచేశారు. దీంతో మనస్తాపానికి గురైన వేమిరెడ్డి.. వైసీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు.
ఇటీవల జగన్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వేమిరెడ్డి తాను అందుబాటులో ఉండటం లేదని చెప్పి దుబాయ్ వెళ్లిపోయారు. అనంతరం హైదరాబాద్ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అలాగే ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి కూడా కావలి లేదా మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
వేమిరెడ్డి రాజీనామాతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటిదాకా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొంతకాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు పెద్దారెడ్లుగా భావించే ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. తాజాగా వేమిరెడ్డితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలో వైసీపీ కనుమరుగు కావడం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments