100% కొత్తగా ఉండే లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్ ఈడు గోల్డ్ ఎహే - డైరెక్టర్ వీరు పోట్ల
- IndiaGlitz, [Thursday,October 06 2016]
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు రచయితగా వర్క్ చేసి...బిందాస్ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన రైటర్ టర్నడ్ డైరెక్టర్ వీరు పోట్ల. ఆతర్వాత రగడ, దూసుకెళ్తా చిత్రాలతో వరుస విజయాలు సాధించిన వీరు పోట్ల తాజాగా తెరకెక్కించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే. సునీల్ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం దసరా కానుకగా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వీరు పోట్లతో ఇంటర్ వ్యూ మీకోసం..!
ఈడు గోల్డ్ ఎహే చిత్ర కథ ఏమిటి..?
ప్రస్తుతం ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ వలన ధియేటర్స్ కి వచ్చి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. అది తప్పు అని అనడం లేదు. నా స్ట్రెంగ్త్ కూడా ఎంటర్ టైన్మెంట్. అందుచేత ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే రొటీన్ స్టోరీ కాకుండా కొత్తకథను కొత్త పద్దతిలో చెప్పాను. ఓ కొత్త సినిమా అందిస్తున్నాను అనే సంతృప్తి కలిగించింది ఈ సినిమా.
ఇంతకీ కథ ఏమిటో చెప్పలేదు..!
కథ గురించి ఏం చెప్పినా అసలు కథ తెలిసిపోతుంది. అందుచేత కథ గురించి ఏం చెప్పను. ఈ కథలో ట్విస్ట్, థ్రిల్, ఎంగ్జైట్ మెంట్ ఉంటుంది.
సునీల్ అంటే కామెడీ అందరికీ తెలిసిందే...! మీరు కూడా ఎంటర్ టైన్మెంట్ బాగా హ్యాండిల్ చేస్తారు మరి...మీరిద్దరూ కలిసి చేసిన ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఏరేంజ్ లో ఉంటుంది..?
ప్రతి ఫ్రేమ్ లో కామెడీ ఉంటుంది. అయితే కామెడీ కోసం అని సపరేట్ ట్రాక్స్ లేవు. ప్రతిదీ కథలో భాగంగానే ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా కథలో భాగంగానే ఉంటాయి తప్ప కావాలని ఫైట్స్ పెట్టలేదు. మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఫస్టాఫ్ రెండు పాటలు, సెకండాఫ్ రెండు పాటలు. మన ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ ఉన్నారు. నా అన్ని సినిమాల్లో ఉండే భరత్, వెన్నెల కిషోర్ కామెడీ ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే... ఆడియోన్స్ కు ఈ సినిమా లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్.
ఈడు గోల్డ్ ఎహే అనే టైటిల్ పెట్టారు కారణం ఏమిటి..?
ఈ సినిమాకి ఈడు గోల్డ్ ఎహే అనే టైటిల్ 100% యాప్ట్. అంతకు మించి ఎక్కువుగా చెప్పలేను.
సునీల్ క్యారెక్టర్ లో టు షేడ్స్ ఉంటాయని తెలిసింది..?
సునీల్ కి సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ ఇది. సునీల్ నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. సునీల్ కి శత్రువులు ఉండరు అజాత శత్రువు. టు షేడ్స్ ఉంటాయా అనేది రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఏం చెప్పినా ఇంట్రస్ట్ పోతుంది అని నా ఫీలింగ్.
ఈ సినిమాకి ఇన్ స్పిరేషన్ ఏమిటి..?
ఇన్ స్పిరేషన్ అంటే ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంఘటన వలన ఇన్ స్పైయిర్ అయి ఈ కథ రాసాను అని చెప్పలేను. నేను ఇప్పటి వరకు చూసిన సినిమాల వలన ఇన్ స్పైయిర్ అయ్యిండొచ్చు. ఆ ఆలోచనలోంచి పుట్టి ఉండచ్చు. అయితే....ఇది 100% కొత్తది నా మైండ్ లోంచి వచ్చింది అని కాన్పిడెంట్ గా చెప్పగలను.
దూసుకెళ్తా తర్వాత గ్యాప్ రావడానికి కారణం ఏమిటి..?
వెంకటేష్, రవితేజ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరిగింది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలి అని ప్లాన్ చేసారు. కథ రెడీ అంతా ఓకే. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత వేరే హీరోతో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను. అది కూడా రకరకాల కారణాల వలన ఆగిపోయింది. దీంతో గ్యాప్ వచ్చింది. ఇక నుంచి గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను.
రెండు ప్రాజెక్ట్ లు అనుకుని లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అయినప్పుడు మీ ఆలోచనా విధానం ఎలా ఉండేది..?
ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకోవడం కంటే నా టైమ్ బాగోలేదు అనుకున్నాను. అలాగే నేను మంచి స్ర్కిప్ట్ తీసుకెళ్లలేదేమో అనుకున్నాను.
టైమ్ బాగోలేదేమో అనుకున్నాను అంటున్నారు..! జాతకాలు బాగా నమ్ముతారా..?
నేను దేవుడిని నమ్ముతాను. జాతకాల గురించి అసలు ఆలోచించను. దేవుడిని కూడా ఫెయిల్యూర్ వస్తే తట్టుకునే శక్తిని ఇ్వమని అడుగుతాను తప్ప నాకు ఇది కావాలి అది కావాలి అని అడగను. మనం దేనినైనా గట్టిగా నమ్ముకుని సిన్సియర్ గా ట్రై చేస్తే అనుకున్నది జరుగుతుంది. ఆ దేవుడే మనల్ని గెలిపిస్తాడు అని నా గట్టి నమ్మకం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ఈడు గోల్డ్ ఎహే రిలీజ్ తర్వాత చెబుతాను. సునీల్, అనిల్ సుంకర్, నేను కలిసి వరుసగా సినిమాలు చేస్తాం ఇది మాత్రం కన్ ఫర్మ్..!