Veera shankar :దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వీరశంకర్

  • IndiaGlitz, [Friday,February 16 2024]

ఇటీవల జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో వీరశంకర్(Veera Shankar) ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టింది. దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా కృషిచేస్తామని తెలిపారు. గెలిచిన క్షణం నుంచే కార్యాచరణను ప్రారంభించామన్నారు. మాకున్న రెండేళ్ల స్వల్ప కాలంలోనే దర్శకుల సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు.

ఇక ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బేబీ మూవీ దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh ), బింబిసార దర్శకుడు వశిష్ట(Vassishta)లు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రధానకార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ క్రిష్ణమోహన్, కూరపాటి రామారావు,ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ హాజరయ్యారు.

కాగా ఈనెల 11వ తేదీన తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వీర శంకర్‌ ప్యానల్‌ గెలుపొంది. సంఘం ప్రెసిడెంట్‌గా వీర శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌లుగా వశిష్ఠ, సాయి రాజేశ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరగ్గా.. అనంతరం ఫలితాలు వెలువడ్డాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉంటే.. 1,113 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లలో వీరశంకర్‌కు 536, ప్రత్యర్థి వి.సముద్రకు 304 ఓట్లు వచ్చాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగుతుంది. వీర శంకర్‌ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు. ‘హలో: ఐ లవ్‌ యూ’, ‘ప్రేమ కోసం’, ‘విజయరామరాజు’, ‘గుడుంబా శంకర్‌’, 'యువరాజ్యం' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.