Vasuki Review
మహిళలపై జరుగుతున్న దురాక్రమాలను ఆరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా పలితం లేకపోతుంది. మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అలా అన్యాయానికి గురైన ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథతో తెరకెక్కించబడ్డ చిత్రం `వాసుకి`. నయనతార టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. ఇంతకు వాసుకి చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పాడనే విషయం తెలుసుకోవాలంటే సినిమా ఏంటో చూద్దాం..
కథ:
వాసుకి(నయనతార), వెంకట్ మల్లూరి(మమ్ముట్టి) ప్రేమ వివాహం చేసుకుంటారు. వారికి ఓ పాప ఉంటుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ ఉంటారు. అపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు యువకులు వాసుకిపై అత్యాచారం చేస్తారు. జరిగిన అకృత్యాన్ని వాసుకి ఎవరికీ చెప్పుకోలేకుండా బాధ పడుతూ ఉంటుంది. అదే సమయంలో సిటీకి లేడీ ఐపియస్ ఆఫీసర్ డిప్యూటీ కమీషనర్ ఆఫీసర్‌గా వస్తుంది. వాసుకి ఆమెతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటుంది. తనపై అత్యాచారం చేసిన ముగ్గురి చంపేయాలనుకుంటున్నానని చెబుతుంది. లేడీ ఆఫీసర్ కూడా వాసుకి పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు సపోర్ట్ చేస్తానంటుంది. వాసుకి ఓప్లాన్ ప్రకారం ముగ్గురుని చంపేస్తుంది. ఇంతకు వాసుకి కోసం ఐపియస్ ఆఫీసర్ ఎందుకు రిస్క్ తీసుకుంటుంది? వాసుకి భర్త వెంకట్‌కు ఈ విషయాలు తెలిశాయా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
వాసుకి సినిమాలో నయనతార, మమ్ముట్టిల నటన ప్రధాన హైలైట్. ఫస్టాఫ్ సాగదీతగగా కనపడుతుంది. ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక, లోలప దాచుకోలేక పడే ఇబ్బందిని ఫస్టాఫ్‌లో చూపించాడు దర్శకుడు సాజన్. సెకండాఫ్ బావుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ స్టేజ్ నుండి సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటే, క్లైమాక్స్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. మమ్మట్టి క్యారెక్టర్ రివీల్ అయిన తీరుని దర్శకుడు సాజన్ చక్కగా చిత్రీకరించాడు. మమ్ముట్టి క్యారెక్టర్‌ను దర్శకుడు సాజన్ కొత్తగా ప్రెజంట్ చేశాడు. తన కుటుంబం బాగుండాలనుకునే ఓ వ్యక్తి తన భార్యకు ఎలా సహాయపడతాడనేదే పాయింట్‌ను ఎక్కడా రివీల్ కాకుండా చివరి వరకు నడిపించిన తీరు అద్భుతం. ఇక నయనతార ప్రతీకారం తీర్చుకునే పద్ధతి కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. గృహిణి పాత్రలో నయనతార నటన మెప్పిస్తుంది. ఇక సినిమాలో మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సాజన్ రాసుకున్న పాయింట్ బావుంది. అయితే ఫస్టాఫ్ విషయంలో కాస్తా కేర్ తీసుకుని ఉంటే బావుండేది. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేశాడే కానీ, ఆడియెన్స్‌ను ఎగ్జయిట్‌మెంట్ చేయాలనుకోకపోవడంతో సినిమా సాగదీత దోరణిలో కనపడుతుంది. ఇక రోబి వర్గేశే రాజ్ సినిమాటోగ్రఫీ సహజంగా ఉండి బాగుంది. కీలక సన్నివేశాల్లో గోపి సుందర్ అందించిన నైపథ్య సంగీతం ఆకట్టుకుంది. వివేక్ హర్షన్ తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలని తొలగించాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
బోటమ్ లైన్: వాసుకి..నేటి మహిళ (జరిగిన అన్యాయం తిరగబడుతుంది)
Vasuki Movie Review in English Version
- Read in English