Vasireddy Padma:మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎందుకంటే..?
- IndiaGlitz, [Thursday,March 07 2024]
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలైన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి జీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కుదరదన్నారు. అందుకే ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగలేదనే భావన కొందరిలో ఉండొచ్చని.. ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరి మహిళలకు కూడా ఇదే అభిప్రాయం ఉండొచ్చన్నారు. కానీ అది నిజం కాదని.. జగనన్న మహిళల సాధికారత కోసమే పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె సక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
తన స్వస్థలం జగ్గయ్యపేట కాబట్టి అక్కడి నుంచే పోటీ చేస్తాననే వార్తలు రావడం సహజమన్నారు. కానీ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజీనామాకు సంబంధం లేదంటూనే.. పార్టీ ఆదిశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పడం గమనార్హం. తనది కమ్మ సామాజిక వర్గం, తన భర్తది ఎస్సీ సామాజికవర్గమని.. ఇది దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆలోచన చేస్తుందన్నారు. ఏమో గుర్రం ఎగరొచ్చు.. తనకు సీటు రావొచ్చన్నారు.
అయితే వాసిరెడ్డి పద్మ ఉన్నట్టుండి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగ్గయ్యపేట నుంచి ఆమెను బరిలో దింపాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేశారని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు. కాగా టీడీపీ తరపున జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి వైసీపీ అభ్యర్థిగా ఇద్దరిలో ఎవరిని నిర్ణయిస్తారో వేచి చూడాలి.